
అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పాట్ కమిన్స్, కెమరూన్ గ్రీన్, నాథన్ ఇల్లిస్ సేవలు కోల్పోయిన ఆ జట్టు.. తాజాగా వికెట్‌కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ సేవలను కూడా మిస్ అయ్యింది. వీరంతా లేకుండానే ఆసీస్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఈ వారం ప్రారంభంలో గాయపడ్డ ఇంగ్లిస్ న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికంతా కోలుకుంటాడని భావించారు. అయితే అతని గాయం తీవ్రత అధికంగా ఉండటం చేత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆసీస్ సెలెక్టర్లు ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయంగా అలెక్స్ క్యారీ పేరును ప్రకటించారు.
ఇంగ్లిస్ భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్‌తో సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్టు నవంబర్ 8 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తాడు. ట్రవిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, మ్యాట్ కుహ్నేమన్ సభ్యులుగా ఉన్నారు.
అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.