సంచలనాల సిరీస్‌.. రికార్డులు

Australia Versus South Africa Test Series Records - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌ :​​​​​​​ ‌ఎన్నో వివాదాలు.. మరెన్నో రికార్డులతో ప్రపంచ క్రికెట్‌ అభిమానులు దృష్టి సారించిన సిరీస్‌ దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌. ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటీస్‌ జట్టు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్‌ ప్రారంభం ముందు నుంచే మాటల యుద్దం నడిచిన ఈ సిరీస్‌లో ఎన్నో కొత్త రికార్డులు, మరెన్నో చెత్త రికార్డులు నమోదయ్యాయి. 

చివరి టెస్టులో 492 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీ జట్టు.. 1970లో అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక పరుగుల పరంగా 1934 తరువాత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయం. మొత్తంగా చూస్తే పరుగుల పరంగా నాలుగో అతి పెద్ద విజయం. 1928లో ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకు ఇదే అతి పెద్ద విజయం. కాగా 1934లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. 1911లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 530 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మధ్య కాలంలో 2004లో ఆసీస్‌ 491 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై  సాధించిన విజయం టెస్ట్ చరిత్రలో పరుగుల పరంగా ఐదో అతిపెద్ద విజయం. 

వ్యక్తిగత ప్రదర్శనలోనూ ఆటగాళ్లు కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. ప్రొటీస్‌ బౌలర్‌ ఫిలాండర్‌ ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులిచ్చి ఆరుకు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టూవర్ట్‌ బ్రాడ్‌ (15/8) ఇప్పటివరకు అత్యుత్తమం. ఈ సిరీస్‌లో మిచెల్‌ మార్ష్‌ వికెట్ తీయడంతో ఫిలాండర్‌ రెండు వందల వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాస్టెస్ట్‌గా రెండొందల వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా నాలుగో బౌలర్‌గానూ నిలిచాడు. ప్రొటీస్‌ జట్టు ఓపెనర్‌ మర్‌క్రామ్‌ పది టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ప్రొటీస్‌ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. 

ఇక ఆసీస్‌ అత్యంత చెత్త ప్రదర్శన చేసిన సిరీస్‌గా ఇది నిలిచిపోతుంది. ఆతిథ్య ఆటగాళ్లు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేయగా ఆసీస్‌ మాత్రం చతికిలపడింది. ఈ సిరీస్‌లో ప్రొటీస్‌ జట్టు ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించగా, ఆసీస్‌ తరుపున ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోవడం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top