
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుంబ్లే
భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తనకు 77వ సభ్యుడిగా చోటు కల్పించనున్నారు.
దుబాయ్: భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తనకు 77వ సభ్యుడిగా చోటు కల్పించనున్నారు. ఈ ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సందర్భంగా కుంబ్లే పేరును హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చనున్నారు. ప్రస్తుత ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే ఈ ఘనత దక్కించుకున్న నాలుగో భారత క్రికెటర్. గతంలో బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లకు ఈ గౌరవం దక్కింది. కుంబ్లేతో పాటు 78వ క్రికెటర్‌గా మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచిన దివంగత బెట్టీ విల్సన్ కూడా ఉండనున్నారు.
‘ప్రపంచకప్ జరుగుతుండగానే నాకు ఈ గౌరవం దక్కబోతున్నందుకు గర్వంగా ఉంది. గొప్ప ఆటగాళ్ల సరసన నిలుస్తుండడం ఆనందంగా ఉంది’ అని కుంబ్లే అన్నాడు. మురళీధరన్ (800), షేన్ వార్న్ 708)ల తర్వాత అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే (619) రికార్డులకెక్కాడు. అంతేకాకుండా 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన ఇద్దరిలో కుంబ్లే ఒకడు కావడం విశేషం.