
అజింక్యా రహానే
సాక్షి, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ పర్యటనకు ప్రిపరేషన్, మంచి ప్రారంభం ఎంతో అవసరమని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో రహానే మాట్లాడుతూ.. ‘ ప్రతి పర్యటనకు ముందు ప్రిపరేషన్ ఎంతో అవసరం. గత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లో మేం అలానే విజయాలందుకున్నాం. సిరీస్ ప్రారంభం అద్భుతంగా ఉంటే విజయాలు సులువుగా సొంతమవుతాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. 60 వికెట్లు పడగొట్టడం ఆశామాషి వ్యవహారం కాదు. పేసర్‌లు, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో మాలో పట్టుదల పెరిగిందని’ రహానే చెప్పుకొచ్చాడు.
తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమైన రహానే చివరి టెస్టుకు ఎంపికై భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. ‘జోహన్నస్ బర్గ్ పిచ్ చాలా ప్రమాదకరమైనది. కానీ ఈ అవకాశం నన్ను హీరోను చేసింది. నాకు తొలి రెండు టెస్టుల్లో అవకాశం రాలేదు. నేను నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టా. జోహన్నస్ బర్గ్‌లో ఎలా ఆడాలో గ్రహించి అదే చేశా. ఈ విజయంలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉంది.’ అని ఈ ముంబై ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఇక ఓవర్‌సీస్ పర్యటనలను చాలెంజింగ్‌గా తీసుకున్నామన్న రహానే.. స్వదేశ పిచ్‌లుగా భావించే అద్భుత ప్రదర్శన కనబర్చామన్నాడు.
కుంబ్లే పరుగులు చేయమని డిమాండ్ చేసేవాడు..
మాజీ కెప్టెన్ గంగూలీ మాట్లాడుతూ.. ‘బౌలింగ్ ప్రదర్శనతోనే కోహ్లిసేన ఓవర్‌సీస్‌లో రాణిస్తోందన్నారు. భారత క్రికెట్ ఎప్పుడు బ్యాట్స్‌మన్‌పై ఆధారపడేది. బ్యాట్స్‌మన్ 400 పరుగులు చేస్తే బౌలర్లు 20 వికెట్లు పడగొట్టేవారు. కానీ తొలిసారి బ్యాట్స్‌మన్ పరుగులు చేయకున్నా బౌలర్లు రాణించారని చెప్పుకొచ్చారు. ఇక తన హయాంలో తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయాలని, ఆ తర్వాత గెలుపు తను చూసుకుంటానని కుంబ్లే అనేవాడని గుర్తు చేసుకున్నారు. ఇక మహ్మద్ షమీ వ్యవహారంపై ప్రశ్నించగా.. గంగూలీ తిరస్కరించారు. అది అతని వ్యక్తిగత వ్యవహారమని, క్రికెట్ గురించి మాట్లడటమే మంచిదని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డారు.