కొమ్ములు రావెందుకు!

After the drop of Mithali Raj, no one is in the womens team - Sakshi

ఉమన్‌ లీడర్స్‌ స్ట్రాంగ్‌గా ఉంటారు కానీ స్ట్రాంగ్‌గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. నేనెంత ఇస్తున్నాను అనే కానీ నాకెంత వస్తోందన్నది చూసుకోరు. అయితే ఈ ధోరణిని కాస్తయినా మార్చుకోవాలని యూరోపియన్‌ బిజినెస్‌ స్కూల్‌ పరిశోధకులు సలహా ఇస్తున్నారు!

టీమ్‌వర్క్‌లో ‘నడిపించడం’ మెయిన్‌ వర్క్‌. నెట్‌వర్క్‌లో ‘కలుపుకుంటూ  నడిపించడం’ మేజర్‌ వర్క్‌. నడిపించడానికైనా, కలుపుకుంటూ నడిపించడానికైనా ఒక హెడ్డు ఉండాలి. ఆ హెడ్డుకు రెండు కొమ్ములు ఉండాలి. అవొచ్చేం కుమ్మేయవు. కుమ్మేయకపోయినా, కుమ్మేస్తాయేమోనన్న భయం టీమ్‌ మెంబర్స్‌ కడుపులో ఉండాలి. అందుకోసమైనా ఆ హెడ్డు తలపై కొమ్ములుండాలి.చిన్నపాటి టీమ్‌నైనా మేనేజ్‌ చెయ్యడం పెద్ద పని. నలుగురు సభ్యులున్న టీమ్‌లో కూడా ఒక డొనాల్డ్‌ ట్రంప్‌ ఉంటాడు. ఒక కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఉంటాడు. ఒక లష్కరే తోయిబన్‌ ఉంటాడు. పైకి కనిపించని ఒక ముష్కరుడు ఉంటాడు. వీళ్లతో పని చేయించాలి. వీళ్ల వల్ల çపని చెడకుండానూ చూసుకోవాలి. కొమ్ములుంటేనే ఇది సాధ్యం. మరి కొమ్ముల్లేని మనిషైతే? లేకపోవడం ఉండదు. కొమ్ములున్న మనిషే దేవుడి ఆఫీస్‌లోనైనా టీమ్‌ లీడర్‌ అవుతాడు. ఒకవేళ కొమ్ముల్తో పనేముందని ఎవరైనా చిరునవ్వుతో వచ్చి చైర్‌లో కూర్చుంటే, వెంటనే టీమ్‌లోని వాళ్లకు కొమ్ములొచ్చి, చైర్‌లో ఉన్న చిరునవ్వును పొడవడానికి వస్తాయి. కనుక కొమ్ములున్న హెడ్డునే కంపెనీలు ప్రిఫర్‌ చేస్తుంటాయి.

టీమ్‌నంతటినీ పూటకోసారైనా గుంపుగా నిలబెట్టి పెద్దగా అరిచేయడం, ఫైర్‌ చేసి పడేస్తానని ఫైల్స్, వాటర్‌ బాటిల్స్‌ విసిరిగొట్టడం, గాజుబల్ల మీద దబీదబీమని పిడిగుద్దులు గుద్దడం, పైవాళ్ల నిఘా నీడలో ఉన్నారని బెదరించడం, టీమ్‌లోనే ఒకరి మీద ఒకర్ని నిఘాకు పెట్టడం.. ఇంత ఉంటుంది ఒక టాస్క్‌ పూర్తవడానికి! టాస్క్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయ్యాక హెడ్డుకు పేరొస్తుంది. టీమ్‌వర్క్‌ నుంచి.. టీమ్‌లను నడిపించే నెట్‌వర్క్‌ హెడ్డుగా కొమ్ముల కీర్తి కిరీటం లభిస్తుంది. టీమ్‌ చేత తిన్నగా ఒక చిన్న పనినైనా చేయించడం వెనుక ఇంత కృషి, క్రుంగుబాటు ఉంటాయి కనుకే ఈ కొమ్ముల ఫీల్డులో కీర్తి కిరీటధారణ వరకు ఎదుగుతూ వెళ్లే మహిళా టీమ్‌ లీడర్స్‌ చాలా తక్కువమంది కనిపిస్తుంటారు. ఏ? అంటే..  కొమ్ములు పెట్టుకునొచ్చి క్యాబిన్‌లో కూర్చోవడం వాళ్లకు ఇష్టం ఉండదు. ఏ? అంటే.. కొమ్ములు మనుషులక్కాదు కదా ఉండేది అని వారి సందేహం.

‘మరి ఎప్పుడు ఎదుగుతావ్‌ మహిళా?’ అంటే.. వర్క్‌ కదా ఎదగాల్సింది. ఉమన్‌గా నేను కాదు కదా’ అని ఆమె సమాధానం! ‘ఓకే దెన్‌. వర్క్‌ ఎదగాలన్నా, రెండు పెట్టుడు కొమ్ములైనా ఉండాలి కదా’.. అంటే.. ‘నేనూ వారితో కలిసి పనిచేస్తాను. కలిసి పనిచేసేటప్పుడు కొమ్ములు అడ్డుపడకూడదు కదా’ అని ఆమె స్కూల్‌ ఆఫ్‌ థాట్‌.   జర్మనీలోని ‘యూరోపియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ (ఈఎస్‌బీ) ఇటీవల 37 మంది హై–ప్రొఫైల్‌ ఉమన్‌ లీడర్స్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాగే.. ‘కొమ్ములెందుకు?’ అని ఆ లీడర్స్‌ క్వశ్చన్‌ చేశారు. వాళ్లంతా జర్మనీలోని పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలలో పెద్ద పెద్ద పొజిషన్‌లలో ఉన్నవారు. పెద్ద పొజిషనే కానీ, పెద్ద సంఖ్యేం కాదు. మగ సీఈవోలు, సీఎఫ్‌వోలతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువ.. ఎంత పెద్ద దేశంలోనైనా. 

ఉన్న ఈ కొద్దిమందికైనా కొమ్ములెందుకు లేవని ఈఎస్‌బీ ఎనలైజ్‌ చేసింది. ఆ ముప్పై ఏడు మంది ఇచ్చిన సమాధానాలను బట్టి జరిగిన ఎనాలిసిస్‌ అది. ఉమన్‌ లీడర్స్‌ స్ట్రాంగ్‌గా ఉంటారు కానీ స్ట్రాంగ్‌గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. ముందున్న పని మీదే ధ్యాస ఉంటుంది తప్ప,  వెనకేం జరుగుతోందన్నది పట్టించుకోరు. ప్రొఫెషనల్‌గా గొప్ప టాలెంట్‌ ఉంటుంది కానీ, ఉందని చెప్పుకోరు. ఎబౌ ఆల్‌.. నేనెంత ఇస్తున్నాను అనే కానీ, నాకెంత వస్తోందన్నది చూసుకోరు. ఇదీ ఈఎస్‌బీ రిపోర్ట్‌. అందుకే వాళ్లు పెద్దగా అరిచి ఫైల్స్‌ విసిరికొట్టడం లేదు. వాటర్‌ బాటిల్స్‌ని ఎత్తిపడేయడం లేదు. బల్లలపై పిడికిళ్లు బిగించడం లేదు. ట్రంప్‌లు, కిమ్‌లు, లష్కరేలు, ముష్కరేలు.. టీమ్‌లో ఎవరున్నా.. పనిని సాఫ్ట్‌గా నడిపించేస్తున్నారు. ‘అయినప్పటికీ మహిళలు కొంచెం మారాలి’ అని ఈఎస్‌బీ రిపోర్ట్‌ సజెస్ట్‌ చేస్తోంది.

మారడం అంటే.. టీమ్‌ని నడిపిస్తున్నప్పుడు.. ముందే కాదు, కాస్త వెనుకా చూసుకుంటూ ఉండటం. లేకుంటే ఏ కొమ్మో వచ్చి పొడిచేస్తే ఎలా అని. ఇండియ  ఉమన్‌ క్రికెట్‌ టీమ్‌లో ఇప్పుడు జరిగిందదే! రెండు మ్యాచుల్లో టీమ్‌లోంచి స్టార్‌ ప్లేయర్‌ మిథాలీరాజ్‌ని డ్రాప్‌ చేసిన తర్వాత ఆ మహిళా టీమ్‌లో ఎవరూ ప్రశాంతంగా లేరు. టీమ్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. సెలక్టర్‌ సుధా షా. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. టీమ్‌ మేనేజర్‌ తృప్తి భట్టాచార్య. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. బి.సి.సి.ఐ. సభ్యురాలు డయానా ఎడుల్జీ. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. మరి  మిడిల్‌ ఆఫ్‌ ది రోడ్‌.. మిథాలీ ఎందుకు డ్రాప్‌ కావలసి వచ్చింది? ఎందుకంటే వెనుక నుంచి రెండు కొమ్ములొచ్చి పొడిచాయి. ఆ కొమ్ములు కోచ్‌ రమేశ్‌ పొవార్‌వి! పొడిచింది కోచ్‌ అయినా, డీఫేమ్‌ అయింది టీమ్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌. అందుకే ఉమన్‌ టీమ్‌ లీడర్స్‌ క్రికెట్‌లోనే కాదు, కార్పొరేట్‌ వరల్డ్‌లోనూ కొమ్ముల్ని కనిపెట్టి ఉండాలి. లీడర్‌కి కొమ్ములు లేకపోవడం మంచి విషయమే. కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం మాత్రం.. నాట్‌ ఎ గుడ్‌ లీడర్‌షిప్‌.   
       
- మాధవ్‌ శింగరాజు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top