
దేశవాళీ క్రికెట్ లో ధోని!
టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.
బెంగళూరు: టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరపున ధోని ఆడాలనుకుంటున్నాడు. ఇది కూడా పాకిస్థాన్ -టీమిండియాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో దేశవాళీ లీగ్ లో ఆడాలనుకుంటున్నట్లు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేన్ సెక్రటరీ రాజేశ్ వర్మ పేర్కొన్నారు. దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాలనే కోరికను ధోని తాజాగా వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు.
' మేము ధోనితో మాట్లాడాం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని ధోని మమ్ముల్ని అడిగాడు. ఆ సమయంలో పాకిస్థాన్-టీమిండియాల సిరీస్ లేకపోతే ధోని జట్టుతో కలుస్తాడు. ఆ ట్రోఫీలో ధోని ఎన్ని మ్యాచ్ లు ఆడతాడనేది కచ్చితంగా తెలియదు. అతని కోరితే జార్ఖండ్ కు ధోనినే కెప్టెన్ గా కొనసాగుతాడు' అని రాజేశ్ వర్మ పేర్కొన్నారు. ఒకవేళ ధోని ఆ ట్రోఫీలో ఆడినట్లయితే ఎనిమిది సంవత్సరాల తరువాత మళ్లీ దేశవాళీ మ్యాచ్ ల్లో పాల్గొనట్లవుతుంది. చివరిసారిగా 2007లో కోల్ కతా లో జరిగిన సయ్యద్ ముస్తాఖా అలీ ట్వంటీ 20 చాంపియన్ షిప్ లో ధోని దేశవాళీ లీగ్ ఆడాడు.