
టీమిండియా క్రికెటర్ హర్షల్ పటేల్ (Harshal Patel) కీలక నిర్ణయం తీసుకున్నాడు. హర్యానా క్రికెట్ (Haryana Cricket)తో దశాబ్దానికి పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. తిరిగి సొంత జట్టు గుజరాత్‌కు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కాగా 34 ఏళ్ల హర్షల్ పటేల్.. 2008-09 సీజన్ సందర్భంగా గుజరాత్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
నాయకుడిగానూ..
అయితే, అండర్-19 వరల్డ్‌కప్-2010 (U-19 World Cup) తర్వాత హర్షల్‌కు గుజరాత్ జట్టులో చోటు కరువైంది. ఈ క్రమంలో హర్యానాకు మారిన ఈ సీమర్.. ఆల్‌రౌండర్‌గా, కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. పదమూడేళ్ల సుదీర్ఘకెరీర్‌లో హర్యానా తరఫున 246 ఫస్ట్‌క్లాస్ వికెట్లు కూల్చాడు.
అంతేకాదు.. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023-24లో హర్యానా గెలవడంలోనూ హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, తాజాగా ఆ జట్టును వీడి గుజరాత్‌కు వెళ్లిపోవాలని అతడు నిర్ణయించుకోవడం గమనార్హం.
ఈ విషయం గురించి హర్షల్ పటేల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అండర్-19 రోజుల నుంచి.. 2010-11 మధ్య కాలంలో హర్యానా తరఫున నా ప్రొఫెషనల్ కెరీర్ మొదలైంది. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను.
అమెరికాకు షిఫ్ట్ అయి పోయేవాడిని
ఒకవేళ నేను పద్దెనిమిదేళ్ల వయసులో హర్యానాకు వెళ్లి అవకాశాలు అందిపుచ్చుకోకపోతే.. అమెరికాకు షిఫ్ట్ అయి పోయేవాడిని. టీమిండియా తరఫున ఆడే అవకాశం నాకు దక్కేదే కాదు’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన ఉన్ముక్త్ చాంద్‌కు ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో అమెరికా వెళ్లి.. ఆ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. 2012లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన హర్షల్ పటేల్.. తొమ్మిదేళ్ల తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 25 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ 29 వికెట్లు పడగొట్టాడు. 2023లో శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా హర్షల్ చివరగా టీమిండియాకు ఆడాడు.
చదవండి: IND vs PAK: నేను.. రోహిత్ ఘోరంగా ఢీకొట్టుకున్నాం.. ఆరోజు ధోని ఫైర్: కోహ్లి