
భారత క్రికెట్‌లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరివారే ప్రత్యేకం. మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనుడు. విరాట్ కోహ్లి (Virat Kohli).. టెస్టుల్లో టీమిండియాను అగ్రపథాన నిలిపిన సారథి.. సచిన్ టెండుల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా చెరగని రికార్డు..
రోహిత్ శర్మ (Rohit Sharma).. హిట్‌మ్యాన్‌గా గుర్తింపు.. వన్డే, టీ20లలో తిరుగులేని బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు. అయితే, కోహ్లి, రోహిత్ తొలినాళ్లలో ధోని సారథ్యంలోనే ఆడారు. అతడి నాయకత్వంలోనే రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ అయితే.. కోహ్లి నాడు భవిష్య కెప్టెన్‌గా ఎదిగాడు.
నాడు పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్
ఆసియా టీ20 కప్-2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి సంబంధించిన ఓ పాత ఘటన తాజాగా వైరల్ అవుతోంది. ఆసియా వన్డే కప్-2012లో భాగంగా నాడు టీమిండియా పాకిస్తాన్‌తో తలపడింది. ఆరోజు 231/2తో పటిష్టంగా ఉన్న పాక్ జట్టు.. భారీ స్కోరు దిశగా పయనిస్తుండగా.. కోహ్లి- రోహిత్ వల్ల తప్పిదం జరిగింది.
ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో..38 ఓవర్ తొలి బంతిని ఉమర్ అక్మల్ బౌండరీ దిశగా తరలించాడు. బంతిని ఆపే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి- రోహిత్ బలంగా ఒకరినొకరు ఢీకొట్టుకుని కిందపడిపోయారు. ఫలితంగా పాక్‌కు అదనంగా మరో రెండు పరుగులు.. మొత్తంగా త్రీ రన్స్ వచ్చాయి.
ధోనికి చాలా కోపం వచ్చింది
దీంతో కెప్టెన్ ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురించి 2020లో అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. ‘‘ఆరోజు ఎంఎస్ ఏమాత్రం సంతోషంగా లేడు. అప్పుడు తనకి చాలా కోపం వచ్చింది. వాళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. మన వల్ల అదనపు పరుగులు కూడా వస్తున్నాయి.
అప్పుడు వాళ్లకు ఒక్క పరుగే రావాల్సింది. కానీ మనం మూడు ఇచ్చాము. ఇర్ఫాన్ బంతి వెంట నెమ్మదిగా పరిగెడుతూ ధోని వైపు త్రో చేశాడు. అప్పుడు ఎంఎస్.. ‘అసలు వీళ్లిద్దరు అలా ఎలా ఢీకొట్టుకున్నారు. మూడు పరుగులు ఎలా ఇచ్చారు’ అన్నట్లుగా ముఖంలో భావాలు పలికించాడు.
ఆరోజు నేను మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. రోహిత్ డీప్ స్వ్కేర్ లెగ్‌లో ఉన్నాడు. ఇద్దరమూ బంతిని పట్టుకోవాలని పరిగెత్తాము. ఇంతలో నా తల కుడి భాగం అతడి భుజానికి బలంగా తాకింది. అప్పటికి అదేమీ సీరియస్ అనిపించలేదు.
కానీ ఐదు నిమిషాల తర్వాత అసలేం జరిగిందో మాకు అర్థమైంది’’ అని కోహ్లి గుర్తుచేసుకున్నాడు. కాగా నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.
ఛేజింగ్ ‘కింగ్’ భారీ సెంచరీ
ఇక లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి 148 బంతుల్లో 183 పరుగులు సాధించి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్‌తో కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించిన కోహ్లి.. రోహిత్‌తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా.. ఆరు వికెట్లు మిగిలి ఉండగానే.. 48 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. నాటి మ్యాచ్‌లో కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.