
ఆసియా కప్- 2025 (Asia Cup) టోర్నీకి రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుండగా.. టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
భారత్ నుంచి ఐదుగురు
ఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని.. అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్ లీ.. ఆసియా ఉత్తమ టీ20 జట్టును ఎంచుకున్నాడు. ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం.. బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.
యూఏఈ నుంచి ఇద్దరు
అయితే, అనూహ్యంగా యూఏఈ నుంచి ఇద్దరు.. హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్ లీ తన జట్టులో చోటివ్వడం విశేషం. ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్ లీ... స్పిన్ విభాగంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు.
అయితే, బ్రెట్ లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా టీ20 ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ (2007), సూర్యకుమార్ యాదవ్ (2024)లకు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం.
ధోని, రో- కో తమకు తామే సాటి
ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2007లో భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర.
ఇక అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్‌స్కోరర్ రోహిత్ శర్మ (4231 పరుగులు). ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి (4188) ఉన్నాడు. 2024లో కెప్టెన్‌గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా.. కోహ్లి ఖాతాలో మరో టైటిల్ చేరింది.
వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ టోర్నీ తర్వాత రోహిత్- కోహ్లి.. ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు
బ్రెట్ లీ ఎంచుకున్న ఆసియా ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్
విరాట్ కోహ్లి (ఇండియా), రోహిత్ శర్మ (ఇండియా), మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), బాబర్ హయత్ (హాంకాంగ్), మహేంద్ర సింగ్ ధోని (ఇండియా), హార్దిక్ పాండ్యా (ఇండియా), వనిందు హసరంగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), అమ్జద్ జావేద్ (యూఏఈ), మొహమ్మద్ నవీద్ (యూఏఈ), హ్యారిస్ రవూఫ్ (పాకిస్తాన్), జస్‌ప్రీత్ బుమ్రా (ఇండియా).
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు