
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)సరికొత్త చరిత్ర లిఖించాడు. పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో.. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్-2025 టోర్నమెంట్లో దుబాయ్ వేదికగా భారత్- పాక్ ఆదివారం మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
తొలి బంతికే బౌండరీ బాది
ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం అందించాడు. తొలి బంతికే బౌండరీ బాది.. పాక్ కీలక పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi)కి స్వాగతం పలికిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో బంతిని ఏకంగా సిక్సర్‌గా మలిచాడు.
ధనాధన్ దంచికొట్టి
ఆ తర్వాత కూడా ధనాధన్ దంచికొట్టిన అభిషేక్ శర్మ మొత్తంగా.. 13 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 31 పరుగులు సాధించాడు. సయీమ్ ఆయుబ్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఫాహిమ్ అష్రాఫ్ అందుకోవడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ (3.4 ఓవర్లో)కు తెరపడింది.
కాగా పాకిస్తాన్ జట్టు మీద పవర్ ప్లేలో భారత బ్యాటర్లలో ఎవరికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు (31) కావడం విశేషం. ఇదిలా ఉంటే.. అభిషేక్ (31)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), శివం దూబే (7 బంతుల్లో 10 నాటౌట్) రాణించారు. ఫలితంగా 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పాకిస్తాన్‌పై టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత క్రికెటర్లు
🏏అభిషేక్ శర్మ- 31 పరుగులు- 2025లో దుబాయ్ వేదికగా..
🏏విరాట్ కోహ్లి- 29 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా
🏏రోహిత్ శర్మ- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా
🏏కేఎల్ రాహుల్- 28 పరుగులు- 2022లో దుబాయ్ వేదికగా.
చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!