
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఓడించిన సూర్య సేన.. ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్ జరిగింది.
నో షేక్‌హ్యాండ్!
స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్‌పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్‌హ్యాండ్ గానీ లేకుండానే వెనుదిరిగారు.
ముఖం మీదే తలుపు వేశారు!
ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు ఇండియన్ డ్రెసింగ్ రూమ్ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్‌హ్యాండ్’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు.
క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి
‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి.
ఈ విజయం ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.
అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్!
కాగా టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్‌కు నిరాకరించినట్లు ‘టెలికామ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆసియా కప్-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్
👉పాక్ స్కోరు: 127/9 (20)
👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)
👉ఫలితం: పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.
చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩
Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025