అలవోకగా... అలవాటుగా... | Indias massive victory over Pakistan | Sakshi
Sakshi News home page

అలవోకగా... అలవాటుగా...

Sep 15 2025 4:17 AM | Updated on Sep 15 2025 4:17 AM

Indias massive victory over Pakistan

పాకిస్తాన్‌పై భారత్‌ ఘనవిజయం

7 వికెట్లతో టీమిండియా గెలుపు 

రాణించిన కుల్దీప్, అక్షర్‌

మెరిసిన సూర్యకుమార్, అభిషేక్‌ శర్మ

శుక్రవారం ఒమన్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ 

భారత జట్టు పాకిస్తాన్‌పై మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. ఏమాత్రం పోటీ లేని మ్యాచ్‌లో ఏకపక్షంగాదాయాది జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి అతి సునాయాస విజయాన్ని అందుకుంది. ఇటీవల పాక్‌తో మ్యాచ్‌తో ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేని విధంగా, అలవాటుగా మారిపోయినట్లుగా, అలవోకగా మరో గెలుపు మన ఖాతాలో చేరింది. 

ముందుగా భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో తేలిపోయిన పాక్‌ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితం కాగా... ఆ తర్వాత మన ప్రధాన బ్యాటర్లంతా పని పూర్తి చేశారు. దాంతో 25 బంతులæ ముందే టీమిండియా ఛేదన ముగిసింది. భారత్‌లో అక్కడక్కడా ఈ మ్యాచ్‌ ఆడటంపై నిరసనలు, విమర్శలు వినిపించినా... మైదానంలో మాత్రం ప్రేక్షకుల సంఖ్య సంతృప్తికర స్థాయిలో కనిపించింది. టోర్నీ తర్వాతి దశలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది.   

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో ఆసక్తిని రేపిన పోరులో భారత్‌ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (44 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), షాహిన్‌ అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్‌; 4 సిక్స్‌లు) రాణించారు. 

భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... అక్షర్‌ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (13 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ (31 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడుతుంది.  

ఆదుకున్న ఫర్హాన్, అఫ్రిది... 
ఇన్నింగ్స్‌ తొలి బంతిని ‘వైడ్‌’గా వేసిన పాండ్యా... అదనపు బంతికి సయీమ్‌ అయూబ్‌ (0)ను అవుట్‌ చేశాడు. దాంతో తొలి బంతికే భారత్‌కు వికెట్‌ దక్కినట్లయింది. అయూబ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లో బుమ్రా రెండో బంతికే మొహమ్మద్‌ హారిస్‌ (3)ని వెనక్కి పంపాడు. ఈ దశలో ఫర్హాన్, ఫఖర్‌ (17) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. బుమ్రా వరుస ఓవర్లలో ఫర్హాన్‌ ఒక్కో సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి పాక్‌ స్కోరు 42 పరుగులకు చేరింది. 

పాకిస్తాన్‌పై అటు వన్డేలు, ఇటు టి20ల్లో కలిపి బుమ్రా బౌలింగ్‌లో ఒక పాక్‌ బ్యాటర్‌ సిక్స్‌ కొట్టడం ఇది మొదటిసారి మాత్రమే. అతను వేసిన 400వ బంతికిగానీ ఇది సాధ్యం కాకపోవడం విశేషం! అయితే పవర్‌ప్లే తర్వాత భారత బౌలర్లు  ప్రత్యరి్థని పూర్తిగా కట్టి పడేశారు. పరుగులు తీయడంలో పాక్‌ తీవ్రంగా ఇబ్బంది పడగా, మరో వైపు వరుసగా వికెట్లూ పడ్డాయి. ముగ్గురు భారత స్పిన్నర్లను ఏమాత్రం ఆడలేక పాక్‌ 19 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. 

ఫఖర్, సల్మాన్‌ ఆగా (3)లను వరుస ఓవర్లలో అక్షర్‌ వెనక్కి పంపగా... కుల్దీప్‌ వరుస బంతుల్లో హసన్‌ (5), నవాజ్‌ (0) పని పట్టాడు. 7–16 మధ్య 10 ఓవర్లలో పాక్‌ 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో కేవలం 41 పరుగులే చేయగలిగింది. ఒకదశలో వరుసగా 33 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే చివర్లో షాహిన్‌ అఫ్రిది దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. హార్దిక్‌ వేసిన చివరి ఓవర్లో అతను 2 సిక్స్‌లు బాదాడు.  

అర్ధ సెంచరీ భాగస్వామ్యం... 
ఛేదనను భారత్‌ జోరుగా మొదలు పెట్టింది. అఫ్రిది వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతుల్లో 4, 6 బాదిన అభిషేక్‌... అతని తర్వాతి ఓవర్లో కూడా ఇలాగే 4, 6 కొట్టాడు. అయితే ఈ రెండు ఓవర్ల మధ్య అయూబ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌ (7 బంతుల్లో 10) మరుసటి బంతికి వెనుదిరిగాడు. అయూబ్‌ తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్‌... అదే ఓవర్లో అవుటయ్యాడు. 

ఈ దశలో సూర్య, తిలక్‌ ఎక్కడా తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. తొలి 6 ఓవర్లలో భారత్‌ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత చకచకా పరుగులు రాబట్టిన సూర్య, తిలక్‌ మూడో వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగులు జోడించారు. విజయానికి చేరువవుతున్న దశలో తిలక్‌ అవుటైనా...శివమ్‌ దూబే (10 నాటౌట్‌)తో కలిసి సూర్య గెలిపించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 21 బంతుల్లో అభేద్యంగా 34 పరుగులు జత చేశారు. సూఫియాన్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా సూర్య కొట్టిన భారీ సిక్స్‌తో మ్యాచ్‌ ముగిసింది.  

10 అంతర్జాతీయ టి20ల్లో పాకిస్తాన్‌పై భారత్‌ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. నాలుగింటిలో మాత్రమే పాక్‌ గెలిచింది.  

ఆసియా కప్‌లో నేడు 
యూఏఈ X ఒమన్‌ 
వేదిక: అబుదాబి 
సాయంత్రం గం. 5:30 నుంచి 
శ్రీలంక X హాంకాంగ్‌ 
వేదిక: దుబాయ్‌ 
రాత్రి గం. 8:00 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: అయూబ్‌ (సి) బుమ్రా (బి) పాండ్యా 0; ఫర్హాన్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 40; హారిస్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 3; ఫఖర్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 17; సల్మాన్‌ (సి) అభిషేక్‌ (బి) అక్షర్‌ 3; హసన్‌ (సి) అక్షర్‌ (బి) కుల్దీప్‌ 5; నవాజ్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 0; ఫహీమ్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 11; షాహిన్‌ అఫ్రిది (నాటౌట్‌) 33; సూఫియాన్‌ (బి) బుమ్రా 10; అబ్రార్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–1, 2–6, 3–45, 4–49, 5–64, 6–64, 7–83, 8–97, 9–111. బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 3–0–34–1, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–28–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–24–1, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–18–3, అక్షర్‌ పటేల్‌ 4–0–18–2, అభిషేక్‌ శర్మ 1–0–5–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) ఫహీమ్‌ (బి) అయూబ్‌ 31; గిల్‌ (స్టంప్డ్‌) హారిస్‌ (బి) అయూబ్‌ 10; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 47; తిలక్‌ వర్మ (బి) అయూబ్‌ 31; దూబే (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–22, 2–41, 3–97. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 2–0–23–0, అయూబ్‌ 4–0–35–3, అబ్రార్‌ 4–0–16–0, నవాజ్‌ 3–0–27–0, సూఫియాన్‌ 2.5–0–29–0.

‘షేక్‌ హ్యాండ్‌’ లేదు! 
సాధారణంగా టాస్‌ వేసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలపడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కానీ, ఒక చిరునవ్వు కానీ వివాదానికి, అనవసరపు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే కావచ్చు అటు సూర్యకుమార్‌ యాదవ్‌ గానీ ఇటు సల్మాన్‌ ఆగా కానీ అందుకు సాహసించలేదు. ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వకుండా, కనీసం ఒకరివైపు మరొకరు చూడకుండా ఇద్దరూ చెరో వైపునకు వెళ్లిపోయారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా వెళ్లిపోయారు. 

టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన కెప్టెన్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్‌ మొహసిన్‌ నఖ్వీకి సూర్యకుమార్‌ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం మన అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఆ ఒక్క విజువల్‌ను మళ్లీ మళ్లీ చూపిస్తూ సోషల్‌ మీడియాలో అంతా సూర్యను, బీసీసీఐని ఆడుకున్నారు. దాంతో ఈసారి అతను కూడా జాగ్రత్త పడ్డాడు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement