
దేశవాళీ క్రికెట్‌పై మరింత దృష్టి
నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
రీజియన్‌కు ఒక హై పెర్ఫార్మెన్స్ సెంటర్
పడిపోతున్న ప్రమాణాలు పెంచుకునేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చర్యలు
దిగ్గజ ఆటగాళ్లతో అత్యవసర సమావేశం
పలు సూచనలు చేసిన రిచర్డ్స్, లారా, లాయిడ్
సెయింట్ జోన్స్: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక విమర్శల పాలవుతోంది. జాతీయ జట్టు తరఫున కరీబియన్లు కలిసికట్టుగా కదంతొక్కగా చాన్నాళ్లయింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్న విండీస్ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున మాత్రం కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. జట్టులో సమష్టితత్వం లోపించిన నేపథ్యంలో... తిరిగి విండీస్ జట్టులో జవసత్వాలు నింపేందుకు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) చర్యలకు పూనుకుంది.
ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టుల్లో 27 పరుగులకే వెస్టిండీస్ జట్టు ఆలౌట్ కావడంతో ఆ దేశ బోర్డు... మాజీ ఆటగాళ్లతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇందులో సుమారు వంద విషయాలను గుర్తించింది. అందులో దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెంపొందించడం నుంచి మొదలుకొని... యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసేంత వరకు పలు అంశాలు ఉన్నాయని బోర్డు వెల్లడించింది.
ట్రినిడాడ్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో దిగ్గజ ఆటగాళ్లు వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్లయివ్ లాయిడ్, డెస్మండ్ హేన్స్, శివనారాయణ్ చందర్‌పాల్‌తో పాటు ప్రస్తుత విండీస్ జట్టు హెడ్ కోచ్ డారెన్ స్యామీ పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీనియర్ ఆటగాళ్లు కీలక సూచనలు చేశారు. వాటిలో ప్రధానమైనవి...
» మెరుగయ్యేందుకు గుర్తించిన వంద విషయాల్లో ప్రధానమైన ఐదు అంశాలపై మొదట దృష్టిపెట్టాలి. ఆటగాళ్లకు కనీస సౌకర్యాలు, అన్నీ ప్రాంతాల్లో ప్రాక్టీస్ పిచ్‌లు, దేశవాళీ టోర్నమెంట్‌ల బలోపేతం అందులో ప్రధానమైనవి.
» ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఇతర జట్లతో పోల్చుకుంటే వెస్టిండీస్ జట్టు బలహీనంగా ఉండటంతో దాన్ని పటిష్ట పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తొలుత దృష్టి పెట్టాలి.
» వివిధ స్థాయిల్లో నైపుణ్యాల లోపం ఉంది. దేశవాళీల్లో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ అంతర్జాతీయ జట్లతో పోటీపడుతున్న సమయంలో బయటపడుతుంది. అందుకే ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
» దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. ఒక్క రోజులో మెరుగైన ఫలితాలు సాధ్యం కావు. నిరంతర కృషి అవసరం. ఎప్పటికప్పుడు టోర్నీలు నిర్వహించాలి. స్థానిక టోర్నీల్లో మెరిపిస్తున్న వారిని గుర్తించి వారికి మరింత తోడ్పాటు అందించడంతో పాటు దిశానిర్దేశం చేయాలి. ఆటగాళ్ల ఆలోచనా సరళిలో మా ర్పు రావాల్సిన అవసరముంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంతో కూడుకున్న విషయమనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
» రీజియన్‌కు ఒకటి చొప్పున హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లు ఏర్పాటు చేయడం. దీంతో ప్రతిభావంతులను గుర్తించడం సులువవుతుంది.

మార్గాలు వెతకాలి
చాన్నాళ్లుగా వెస్టిండీస్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. రోజు రోజుకూ ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రస్తుతం ఇతర జట్లతో పోల్చుకుంటే మా జట్టు ఎంతో వెనుకబడి ఉంది. గతంలో నైపుణ్యమే ప్రధాన అంశంగా ఉన్న సమయంలో ప్రపంచంలో మేటి జట్టు విండీసే. కానీ కాలం మారింది. సమయంతో పాటు ఆటలోనూ చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు సాంకేతికత పెరిగింది, విశ్లేషణలు ఎక్కువయ్యాయి. వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. క్రికెట్‌లోకి కొత్తగా వచ్చిన దేశాలు సైతం ఈ రంగాల్లో ముందంజలో ఉన్నాయి. తిరిగి సత్తాచాటేందుకు మార్గాలు వెతకాల్సిన అవసరముంది. – లారా, వెస్టిండీస్ మాజీ కెప్టెన్