మిచెల్‌ మార్ష్ మెరుపులు | Australia win over New Zealand in first T20 | Sakshi
Sakshi News home page

మిచెల్‌ మార్ష్ మెరుపులు

Oct 2 2025 1:49 AM | Updated on Oct 2 2025 1:49 AM

Australia win over New Zealand in first T20

43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85

తొలి టి20లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

16.3 ఓవర్లలో 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌ 

టిమ్‌ రాబిన్‌సన్‌ సెంచరీ వృథా

మౌంట్‌ మాంగనీ (న్యూజిలాండ్‌): కెప్టెన్ మిచెల్‌ మార్ష్(43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించడంతో... న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల చాపెల్‌–హ్యాడ్లీ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

టిమ్‌ రాబిన్‌సన్‌ (66 బంతుల్లో 106 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగగా... డారిల్‌ మిచెల్‌ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెవాన్‌ జాకబ్స్‌ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టిమ్‌ సీఫెర్ట్‌ (4), డెవాన్‌ కాన్వే (1), మార్క్‌ చాప్‌మన్‌ (0) విఫలమవడంతో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే న్యూజిలాండ్‌ జట్టు 6/3తో నిలిచింది. ఈ దశలో మిచెల్‌ అండగా... రాబిన్‌సన్‌ విజృంభించాడు. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. 

ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాబిన్‌సన్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించగా... నాలుగో వికెట్‌కు మిచెల్‌తో కలిసి రాబిన్‌సన్‌ 55 బంతుల్లో 92 పరుగులు జోడించాడు. 

ఆ తర్వాత జాకబ్స్‌తో ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 64 పరుగులు జతచేశాడు. చివరి ఓవర్‌లో సిక్స్‌తో రాబిన్‌సన్‌ తన కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లలో బెన్‌ డ్వార్‌షుయ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్ష్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన అతడు... ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించాడు.  మరో ఎండ్‌ నుంచి ట్రావిస్‌ హెడ్‌ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు) కూడా ఎడెపెడా బౌండరీలు బాదడు. ఈ జంట తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించడంతో ఆసీస్‌కు శుభారంభం దక్కింది. హెడ్‌ అవుటైనా... మాథ్యూ షార్ట్‌ (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టడంతో ఆసీస్‌ వేగం కొనసాగింది. 

23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్రెండో వికెట్‌కు షార్ట్‌తో కలిసి 68 పరుగులు జోడించాడు. దీంతో ఛేదన సులువు కాగా... మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టి20 జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement