
PC: ICC
టెస్టు క్రికెట్ దిగ్గజాల్లో వెస్టిండీస్ స్టార్ బ్రియాన్ లారా (Biran Lara)కు ప్రత్యేక స్థానం ఉంది. షాట్ సెలక్షన్ విషయంలో దూకుడుగా ఉండే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చక్కటి ఫుట్‌వర్క్‌తో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. కవర్ డ్రైవ్‌లు, పుల్‌షాట్లు ఆడటంలో అతడు దిట్ట.
స్లెడ్జ్ చేయాలంటే వణుకు
అన్నింటికీ మించి బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైననా లారా ఆత్మవిశ్వాసంతో ఉండటం.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను మరింత భయపట్టేది. అందుకే అతడిని స్లెడ్జ్ చేయాలంటే వాళ్లు వణికిపోయేవారు. అనవసరంగా లారా జోలికి వెళ్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. తమ పనిని పూర్తి చేసుకుని వెళ్లేవారు.

టీమిండియాకూ అదే భయం.. ముందే చెప్పారు
టీమిండియా కూడా లారాను స్లెడ్జ్ చేసే విషయంలో భయపడేదట. భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘స్లెడ్జింగ్ గురించి ముందుగానే ఎలాంటి ప్రణాళికలను మేము సిద్ధం చేసుకునేవాళ్లం కాదు.
అయితే, లారాను మాత్రం అస్సలు స్లెడ్జ్ చేయొద్దని మాత్రం నిర్ణయించుకున్న సంఘటన నాకు గుర్తుంది. అతడితో పెట్టుకోవద్దని ముందే డిసైడ్ అయ్యేవాళ్లం. టీమిండియా వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లినపుడు లారాకు అంతటి ప్రాముఖ్యం ఉండేది.
అతడు బ్యాటింగ్ చేస్తున్నపుడు ఒక్క మాట కూడా అనవద్దని టీమిండియా సమావేశంలో నిర్ణయించారు. తనకు తానుగా అవుటయ్యేంత వరకు వేచిచూడాలని చెప్పేవారు. ఒకవేళ అతడిని మాటలతో రెచ్చగొడితే.. మనమే తిరిగి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు’’ అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
చెక్కు చెదరని ప్రపంచ రికార్డు
కాగా అద్భుతమైన టెక్నిక్‌తో, అగ్రెసివ్ షాట్లతో అలరించే లారా.. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (400 నాటౌట్) సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇక1990- 2006 వరకు వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 56 ఏళ్ల లారా.. 131 టెస్టుల్లో 11953 పరుగులు సాధించాడు. ఇందులో 34 శతకాలు, తొమ్మిది డబుల్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 299 వన్డేలు ఆడిన లారా.. 19 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీల సాయంతో 10405 పరుగులు సాధించాడు.
చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్