21 సిక్సర్లు.. 16 ఫోర్లు! | Sakshi
Sakshi News home page

21 సిక్సర్లు.. 16 ఫోర్లు!

Published Mon, Jul 10 2017 12:08 PM

21 సిక్సర్లు.. 16  ఫోర్లు!

ఈ ఏడాది ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ ఏకంగా టీ 20లో ట్రిపుల్ సెంచరీ కొట్టి పొట్టి ఫార్మాట్ లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సాధారణంగా పొట్టి ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేయడం చాలా కష్టం.  ఏ స్థాయిలో చూసినా 20 ఓవర్ల పరిమిత క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలా అరుదు. అయితే ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ లో మరింత జోరు పెరిగందనే చెప్పాలి. తాజాగా అఫ్ఘానిస్తాన్ ఆటగాడు షఫీఖుల్లా షఫక్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.  స్థానికంగా జరిగిన ట్వంటీ 20 టోర్నమెంట్ లో ఖతీజ్ క్రికెట్ అకాడమీ తరపున ఆడిన షఫిక్(214) డబుల్ సెంచరీ సాధించాడు. 71 బంతుల్లో 21 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ద్విశతకం నమోదు చేశాడు. షఫిక్ దూకుడుతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 351 పరుగులు భారీ స్కోరు చేసింది.

గత మూడు టీ 20 వరల్డ్ కప్ల నుంచి అఫ్ఘాన్ జాతీయ జట్టులో షఫికుల్లా రెగ్యులర్ సభ్యుడు. 2012, 2014, 2016 ల్లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ల్లో షఫికుల్లా అఫ్ఘాన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2014 వరల్డ్ టీ 20లో హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇది ఆ దేశం తరపున ఫాస్టెస్ట్ రికార్డుగా నమోదు కావడం విశేషం కాగా, ఆ మ్యాచ్ లో అఫ్ఘాన్ గెలిచి వరల్డ్ టీ 20లో తొలి గెలుపును అందుకోవడం మరొక విశేషం.
 

Advertisement
Advertisement