పశువులకూ ‘ఆధార్‌’

Aadhar Process To Animals For Tagging In Chejarla - Sakshi

సాక్షి, చేజర్ల: పశువులకు ఆధార్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ హెల్త్‌ (ఇనాఫ్‌) ట్యాగింగ్‌ పేరిట ప్రతి పశువుకు ట్యాగింగ్‌ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో పాలు ఇచ్చే పశువులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత మిగిలిన వాటికి ట్యాగింగ్‌ చేస్తారు. సుమారు మూడు నెలల క్రిందట ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మొదలయినప్పటికీ ఇంతవరకు కేవలం 21 శాతం మాత్రమే పూర్తయింది.

ఫిబ్రవరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పశుగణన ప్రారంభం కావడంతో ఆధార్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధానంగా ట్యాగింగ్‌ పశువుల చెవులకు వేస్తారు. ఆ సమయంలో చెవికి రంధ్రం పెడతారు. అలా చేస్తే పశువుల విలువ పడిపోతుందనే భావన రైతుల్లో ఉంది. దీంతో చాలా మంది రైతులు ట్యాగింగ్‌కు అనాసక్తి చూపుతూ ముందుకు రావడం లేదు. ఈ ప్రక్రియ చేపట్టవద్దని పలు మండలాల్లో రైతులు పశువైద్యాధికారులను కోరుతున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో 1.10లక్షలకు పైగానే ఆవులు, గేదెలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం పాలిచ్చే పశువులకు మాత్రమే తొలివిడతగా ఆధార్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పాలిచ్చే ఆవులు, గేదెలు నియోజకవర్గంలో 70 వేలకు పైగానే ఉన్నాయి. వీటిలో 20 శాతం మాత్రమే గోపాలమిత్రలు ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు.  ప్రతి పశువుకు ట్యాగింగ్‌ అనేది అత్యంత ముఖ్యమైనదని పశువైద్యాధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీని ఆధారంగానే పశుపోషకులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని వెల్లడిస్తున్నారు. అలాగే ట్యాగ్‌లను ఆం«ధప్రదేశ్‌ పశు గణాభివృద్ధి సంస్థ వారు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రచారం నోచుకోకపోవడంతో రైతులు ముందుకు రావడంలేదు. 

మండలం    గేదెల సంఖ్య 
చేజర్ల   1,8000
అనంతసాగరం   1,7500
మర్రిపాడు  1,6000
ఏఎస్‌పేట   1,2000
సంగం  1,4000
ఆత్మకూరు  1,5000 

 

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top