జెడ్పీ పీఠం టీఆర్‌ఎస్‌దే..

ZPTC And MPTC Results TRS Party Winning Josh In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ పీఠాన్ని తొలిసారి టీఆర్‌ఎస్‌ పార్టే దక్కించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఈ పార్టీయే జెడ్పీని పాలించింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ జోరు కొనసాగినా కాషాయం పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. హస్తం పార్టీ కూడా తాను తక్కువ కానన్నట్టు ఢీకొట్టడంతో కారు పూర్తిస్థాయిలో ప్రభంజనం సృష్టించకపోయినా మెజార్టీ సాధించింది. మండలాల్లో అధ్యక్ష పీఠాలను అత్యధికంగా టీఆర్‌ఎస్‌ సాధించినా సిట్టింగ్‌ స్థానాల్లో ఓటమి పాలైంది. తద్వారా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోరాట పటిమ చూపాయి.

నువ్వా.. నేనా?
ఆదిలాబాద్‌ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు 17 ఉండగా, టీఆర్‌ఎస్‌ మెజార్టీ తొమ్మిది స్థానాలను సాధించింది. అయితే ఒకట్రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు సాధించని పక్షంలో జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల్లో సమీకరణలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ సాగింది. అయితే టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించడంతో ఈ చర్చ పక్కన పడింది. బీజేపీ టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చింది. ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లోనే ఆ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ ప్రాదేశిక ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం ఉంటుందని మొదటి నుంచి అనుమానిస్తుండగా, అనుకున్న దానికంటే ఎక్కువే ప్రభావం చూపింది. ఇక కాంగ్రెస్‌ మూడుస్థానాలను గెలుపొంది గత ప్రాదేశికఎన్నికల కంటే ఈసారి బెటర్‌ అనిపించింది. గత ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం ఒకేఒక జెడ్పీటీసీ గెలవగా, ఈ సారి మూడుకు ఎగబాకింది.

పది ఎంపీపీలు టీఆర్‌ఎస్‌ ఖాతాల్లోకే..
జిల్లాలో పది మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది. పది మండలాల్లో ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఎంపీటీసీ స్థానాలను అధికంగా గెలుపొందింది. కాంగ్రెస్, బీజేపీ చెరో మండలంలో గెలుపొందారు. గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లిలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపొందినా ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించలేదు. దీంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌కు వేరే పార్టీల నుంచి ఎంపీటీసీలు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ మండల అధ్యక్ష పదవులు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్తాయి. లేనిపక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒప్పందం కుదిరితే ఆ మండలాలు ఆయా పార్టీలు అధ్యక్ష పదవులను దక్కించుకునే ఆస్కారం ఉంది. ఈనెల 7న మండల అధ్యక్ష ఎన్నిక జరగనుండగా, ఇప్పుడు ఈ మండలాల్లో ఎవరు ఎంపీపీఅవుతారనేది ఆసక్తి నెలకొంది. ఒకవేళ తమ సిద్ధాంతాలు కాదని కాంగ్రెస్, బీజేపీలు జత కడతాయా.. లేనిపక్షంలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎంపీటీసీలను తమవైపు తిప్పుకుంటుందా.. ఈ మూడు రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top