దాడులకు పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

దాడులకు పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్‌ చేయాలి

Published Fri, Apr 12 2019 4:10 AM

YV Subba Reddy Comments On TDP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ సందర్భంగా హింసకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అరెస్ట్‌ చేసి, వారిని ఎన్నికల నుంచి బహిష్కరించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్టి వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్‌తో పాటు మరో నలుగురిపై దాడిచేశాడని, రక్తం వచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌జిల్లాలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కూడా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని కొన్ని బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడిచేశాడన్నారు.

ఇతర జిలాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు వైఎస్సార్‌ కార్యకర్తలు, పోలింగ్‌ ఏజెంట్లపై దాడులు చేశారని, పోలీస్టేషన్లలోనే తమ పార్టీ నాయకులపై దాడికి యత్నించారని వివరించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే, ఎంపీలను అరెస్ట్‌ చేయాలని, ఎన్నికల్లో పోటీకి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ వాళ్లే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే.. వైఎస్సార్‌సీపీ వాళ్లే దాడులు చేస్తున్నట్లు టీడీపీకి బాకాలుగా ఉన్న పచ్చమీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైవీ ఆరోపించారు. వారికి టీడీపీ దాడులు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. గుత్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఈవీఎంలను పగలగొడితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పగలగొట్టినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసే పచ్చ మీడియా చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement