పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిద్ధమవుతున్న కోడి పందేల బరి
‘పుంజు’కుంటున్న కోడి పందేల బరులు
జర్మన్ షెడ్లు.. ఫ్లడ్ లైట్లు వెలుగులు.. ఇతర సెట్టింగ్‌లతో ఏర్పాట్లు
అనేక ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధమైన బరులు
పందేల మాటున కోతాట, గుండాట వంటి జూద శిబిరాలకు వేలం పూర్తి
బరుల్లోనే మద్యం ఏటీఎం కౌంటర్లు
రూ.కోట్లు దండుకుంటున్న కూటమి నేతలు
గోదావరి జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బరుల్ని సిద్ధం చేసిన ‘పచ్చ’బ్యాచ్
సాక్షి నెట్‌వర్క్: సంక్రాంతి ముసుగులో కోడి పందేలు, జూదాలను నిర్వహిస్తే సహించేది లేదని.. ఎట్టిపరిస్థితుల్లో వాటిని అడ్డుకుని తీరాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. పందేలు, జూదాలకు అడ్డుకట్ట వేయాలని.. ఇందుకోసం ఎక్కడికక్కడ వివిధ శాఖల అధికారులతో కమిటీలు వేయడంతోపాటు ఆయా కమిటీల ఆధ్వర్యంలో తనిఖీలు, దాడులు జరపాలని మార్గదర్శకాలు జారీ చేసింది. పైకి మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్టు నటిస్తూ.. పందేలు, జూదాలను చూసీచూడనట్టు వదిలేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ కావడంతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు పుంజుకున్నాయి.
అనేక ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం కాగా.. పందేల మాటున కోతాట, గుండాట వంటి జూద శిబిరాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వీటికి సంబంధించిన వేలం పాటలు సైతం పూర్తయ్యాయి. మరోవైపు బరుల్లోనే ఎనీటైమ్ మద్యం కౌంటర్లు తెరిచి అక్కడే తాగించి.. తూలించేలా ఏర్పాట్లు చేశారు. కూటమి నాయకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులకు కోట్లాది రూపాయల్ని వాటాలు ఇచ్చేలా ఒప్పందాలు కుదిరాయి.
పశి్చమాన వందకు పైనే బరులు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో వందకు పైనే కోడిపందేల బరులను కూటమి నేతలు సిద్ధం చేశారు. భీమవరం పరిసరాల్లోని డేగా
పురం, పెద అమిరం, సీసలి, మహదేవపట్నం, తాడేపల్లి
గూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో 30 వరకు పెద్ద బరులు సిద్ధమయ్యాయి. పందేలకు పేరొందిన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో గ్రామానికి
రెండు, మూడు చొప్పున 70కి పైగా చిన్న బరులు సిద్ధం చేశారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, గుండాట, పేకాట, కోతాట, ఇతర జూదాలు నిర్వహించేందుకు వీలుగా జర్మన్ షెడ్లు, ఫ్లడ్ లైట్లు,
ఇతర సెట్టింగ్‌లతో సిద్ధం చేస్తున్న కొన్ని బరులకు ఒక్కో దానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. బరి ప్రత్యేకత, అక్కడికి వచ్చే జనం రద్దీని
బట్టి రూ.25 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఇచ్చేలా నిర్వాహకులు జూదాలు ఏర్పాటు చేసుకునే వారితో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది.
తూర్పున క్యాసినో డీలర్ల సాయంతో
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, సీతానగరం, చినకొండేపూడి, సింగవరం తదితర ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా పందేలు, జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు, సోఫాలు, కురీ్చలు సిద్ధం చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పెద్దఎత్తున జనరేటర్లు అందుబాటులో పెడుతున్నారు. బరుల వారీగా మద్యం అమ్మకాలకు. నెంబర్లాట, గుండాట, పేకాట నిర్వాహకులకు సైతం వేలం నిర్వహించారు.
ఒక్కో బరికి రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ బరిని రూ.20 లక్షలతో ఏర్పాటు చేస్తే అందులో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీసులకు రూ.3 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. బరి స్థాయిని బట్టి ఈ మొత్తం మరింత పెరగనుంది. సీతానగరం మండలం చినకొండేపూడిలో పేకాట, కోడిపందేలు, గుండాటలతోపాటు పెద్దఎత్తున క్యాసినో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోవా, నేపాల్ నుంచి క్యాసినో డీలర్లను రప్పిస్తున్నట్టు సమాచారం. త్రీకాట్స్, ప్లాన్, ఫుల్‌గేమ్, లోన బయట, గుండాట, పోకల్, కోతముక్క వంటి జూద క్రీడలు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది.
కోనసీమ జిల్లాలో..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోడిపందేలు, గుండాటలు, పేకాటల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు అనధికార మద్యం షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రూ.లక్షల్లో వేలం పాటలు నిర్వహిస్తున్నారు. వీఐపీల కోసం కూలర్‌లు, సోఫా సెట్‌లు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భోగి పండుగ నుంచి మూడు రోజులపాటు అర్ధరాత్రి వరకు పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్‌లైట్‌లు ఏర్పాటు చేశారు. కీలక నేతల వత్తాసుతో బరులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన చోటామోటా నాయకులు సైతం పందేల నిర్వహణకు సై అంటున్నారు.
మంత్రి అండతో బాపట్ల జిల్లాలోనూ..
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకాలో పెద్దఎత్తున కోడిపందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరుకుపల్లి మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో కోడిపందాలు, పేకాట కోసం బరి సిద్ధం చేశారు. ఇందులో ఒకటి పెద్ద బరికాగా.. మిగిలిన పది బరులు చిన్నవి. పెద్ద బరిలో రూ.లక్ష నుంచి రెండు లక్షల పందాలు జరగనుండగా చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి లక్ష వరకు జరగనున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన వారికి ఐదు రోజులపాటు పేకాట ఆడుకునేందుకు రూ.60 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు సమాచారం.
వేమూరు నియోజకవర్గంలో ఐదు బరులు ఏర్పాటు చేస్తున్నారు. వేమూరు మార్కెట్ సమీపంలో టీడీపీ నేత పది ఎకరాల్లో ఒక బరి సిద్ధం చేయగా.. చావలి–కోడిపర్రు మధ్యన జనసేన నేత పది ఎకరాల్లో మరో బరి నెలకొల్పారు. కొల్లూరు సమీపంలో క్రాప వద్ద ఒక బరి, అనంతవరం వద్ద మరొక బరిని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. చుండూరు మండలం వేటపాలెం వద్ద బరి సిద్ధం చేశారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద టీడీపీ నేతలు భారీ బరి ఏర్పాటు చేశారు.
ఎంట్రీ టికెట్లు పెట్టిమరీ..
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బక్కరాములకుంటలో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. పత్తిపాటివారిపాలెం–కొండికందుకూరుకు వెళ్లే తారురోడ్డులో నుంచి పందేల స్థావరం వరకు ప్రత్యేకంగా రోడ్డు కూడా వేశారు. ఎంట్రీ టికెట్లు పెట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు.
పలుకూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణాలో..
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో భారీ హంగులతో బరి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం బరి నిర్వాహకులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రూ.2 కోట్లతో బేరం కుదుర్చుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పెనమలూరు నియోజకవర్గంలోని ఉప్పులూరుతో పాటు కంకిపాడు మండలంలోని 8 పెద్ద బరులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి రూ.3 కోట్ల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం. విజయవాడ సమీపంలోని నున్న, రామవరప్పాడు, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో కోతముక్క, గుండాటకు అధికార పార్టీ నాయకులు బరులు సిద్ధం చేస్తున్నారు. మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో కాలనీలో భారీ బరిని ఏర్పాటు చేసి కోడిపందాలు, కోతముక్క, గుండాటకు సర్వం సిద్ధం చేస్తున్నారు. గుడ్లవల్లేరు, వేమవరం, కూరాడ, అంగలూరు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు భారీగా బరులు ఏర్పాటుచేస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, రంగాపురం, మొర్సుమల్లి, పొందుగల, వెల్వడం, చంద్రగూడెం, గణపవరం, కీర్తిరాయినిగూడెం, మైలవరం, జి.కొండూరు మండల పరిధిలో కోడూరు, వెల్లటూరు, కందులపాడు, కవులూరు, చెరువుమాధవరం, మునగపాడు, గంగినేని, కట్టుబడిపాలెం, కుంటముక్కల, ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి చిన్నలంక, మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, తుమ్మలపాలెం, చిలుకూరు, విజయవాడ రూరల్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో బరులు సిద్ధమవుతున్నాయి. పేకాట అనేక రకాల జూడ క్రీడలు, ఫుడ్ స్టాళ్లు, మద్యం స్టాళ్ల ఏర్పాటుకు మూడు రోజులకు అద్దె రూపంలో భారీఎత్తున వేలం పాటలు ఖరారయ్యాయి.


