
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగిందని వెల్లడించారు. ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోలవరం, అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- విజయవాడ విశాఖ మెట్రో రైలుకు నిధుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది
- భారతమాల, సాగరమాల తదితర పథకాలలో ఏపీకి ఎంత కేటాయించాలనే దానిపై స్పష్టత లేదు
- డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి పథకాలకు ఓవర్ డ్రాఫ్ట్ 5000 ఇవ్వడం స్వాగతించదగ్గ విషయం
- ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చాలా రహస్యంగా చేస్తున్నారు
- మిగతా ప్రభుత్వరంగ సంస్థలను ఇబ్బంది పెట్టి ఎయిరిండియాకు నిధులు సమకూర్చడం మంచిది కాదు
- జీరో బడ్జెట్ వ్యవసాయంపై స్పష్టత లేదు
- స్వచ్ఛభారత్ ఆచరణలో పెద్దగా అమలు కావడం లేదు
- ఎన్నారైలకు ఆధార్ కార్డు ఇవ్వడం అభినందించాల్సిన విషయం
- చిన్న వర్తకులకు పెన్షన్, అందరికీ ఇళ్ల పథకాలు అభినందనీయం