జగన్‌ పాదయాత్ర గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు!

ysrcp mp vijayasai reddy meets president kovind - Sakshi

టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు

విభజన చట్టంలో అమలుకాని అంశాలను రాష్ట్రపతికి వివరించా

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాగోగులు, ఆయన చేపడుతున్న పాదయాత్ర గురించి రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్‌లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74, 75ను వారు అతిక్రమిస్తున్నారని కోవింద్‌కు వివరించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఏపీ స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ బేరసారాలు చేస్తున్నారని, రూ. 25 కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంలో భాగంగా టీజీ వెంకటేశ్‌ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశారని, త్వరలోనే టీజీ వెంకటేశ్‌ బాగోతాన్ని బయటపెడతామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. విభజన చట్టంలో అమలుకాని అంశాలను రాష్ట్రపతికి వివరించామని ఆయన తెలిపారు. ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగా అందరినీ కలుస్తున్నామని, సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసీని కలుస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top