
సాక్షి, కృష్ణా: ఐదేళ్ల కాలంలో చేసిన పనిని చెప్పుకొని ఓట్లు అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదని మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో, ఐదేళ్లలో ప్రజలకు ఏం ఒరగబెట్టారో చెప్పకుండా.. వైఎస్ జగన్‌కు ఓటేస్తే మోదీ, కేసీఆర్‌కు వేసినట్లేనని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, వైయస్సార్ కాలనీలోని శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.
గతంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు ఇప్పుడు జగన్ నామస్మరణతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని నాని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో రంగులు మార్చే ఊసరవెళ్ళిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఇప్పుడు కాంగ్రెతో జతకట్టి రాజకీయ ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఓటు అనే ఆయుధంతో బాబుకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు.