డెయిరీలను ముంచింది చంద్రబాబే 

YSRCP Minister Malagundla Shankaranarayana Slam On Chandrababu Naidu - Sakshi

హెరిటేజ్‌ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వ డెయిరీలను మూతదిశగా నడిపించిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డెయిరీని శుక్రవారం ఆయన పునఃప్రారంభించారు.

సాక్షి, అనంతపురం(పరిగి) : తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చుకునేందుకు ప్రభుత్వ డెయిరీలను నిర్వీర్యం చేసిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధ్వజమెత్తారు. పరిగి మండలం ఊటుకూరులో ఆరేళ్ల కిందట మూతపడిన ప్రభుత్వ పాల డెయిరీని మంత్రి శుక్రవారం పునఃప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలన్న నినాదంతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు తన కుమారుడికి మాత్రమే జాబు కల్పించి యువతను నిలువునా మోసం చేశారని విరుచుకుపడ్డారు. ప్రైవేటు డెయిరీలను ప్రోత్సహించి ప్రభుత్వ డెయిరీలను నష్టాల్లోకి నెట్టేశారని, దీనంతటికీ చంద్రబాబే కారణమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టి, ప్రజలకు అవినీతిరహిత పాలన అందించడానికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌ విధానం ప్రవేశపెట్టారన్నారు. 

పారదర్శక పాలనే లక్ష్యం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల నియామకంతో ప్రతి ఇంటికీ రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతులు, ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి పేర్కొన్నారు. మడకశిర బ్రాంచి కెనాల్‌ నుంచి ప్రధాన చెరువులను నింపుతామన్నారు. పరిగి చెరువులకు నడింపల్లి వద్ద నుంచే కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
10 వేలు ఆర్థిక సాయంతో ఊరట 
ఆటో డ్రైవర్లకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించే పథకానికి ఇటీవలే నోటిపికేషన్‌ విడుదలైందని, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ సుహాసినమ్మ, ఏపీ పాల డెయిరీ జిల్లా డీడీ శ్రీనివాసులు, మేనేజర్‌ బాలరాజు, పశుసంవర్థక శాఖ ఏడీ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top