చంద్రబాబుది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష!

YSRCP Leaders Slams CM Chandrababu naidu - Sakshi

ఆయన ప్రజలను నమ్మించి వంచించారు..

దొంగ దీక్షలతో మోసం చేస్తున్నారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలి

వం‍చన వ్యతిరేక దీక్షలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో దీక్షలు, సభలు అంటూ రకరకాల మోసపూరిత ఎత్తుగడలు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. ప్రజలపై కక్ష అని నిప్పులు చెరిగారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా విశాఖపట్నంలో సోమవారం చేపట్టి ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు ఏమన్నారంటే..

కేంద్రంతో చంద్రబాబు లాలూచీ
చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు నమ్మారని, కానీ ఆయన ప్రజలను నమ్మించి మోసం చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. దొంగ దీక్షలతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ముందుకొస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీని అద్భుతమంటూ.. దానిని చంద్రబాబు అంగీకరించారని, ప్రజల్లో వ్యతిరేకతను చూసి మళ్లీ ఆయన యూటర్న్‌ తీసుకున్నారని ధర్మాన గుర్తుచేశారు. మీరే అన్యాయం చేసి.. మీరే దీక్ష చేస్తానంటే ప్రజలు నమ్మరని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారని, ఇప్పుడు తనను ప్రజలే కాపాడాలని చంద్రబాబు వేడుకోవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన అభ్యర్థించారు.

అది దీక్ష కాదు.. కక్ష
చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. అది తెలుగువారి కక్ష అని వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. విభజన చట్టంలో ఏ ఒక్క హామీపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు. రైల్వేజోన్‌ ఏర్పాటు, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది అని ఆయన చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక హోదా మన హక్కు, మన దిక్కు, మన లక్కు అని ఆయన పేర్కొన్నారు. ఓట్లరూపంలో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.

ముఖ్యమంత్రే దీక్ష చేయడమేంటి?
హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అభివర్ణించారు. చంద్రబాబు ‘ఆల్‌ ఫ్రీ’ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

నాలుగేళ్లుగా వంచిస్తూనే ఉన్నాడు
చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తూనే ఉన్నాడని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. హోదా మాట రాష్ట్రంలో వినపడకుండా కుట్రలు చేసిన బాబు ఇప్పుడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇన్ని రోజులు హోదా మాటా ఎత్తని చంద్రబాబు ఇప్పుడు కొంగ జపాలు చేస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.

చంద్ర బాబు లెంపలు వేసుకోవాలి
రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా చేసిన అన్యాయానికి​ చంద్రబాబు చెంపలు వేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు, పోలవరం కమీషన్ల వ్యవహారం, రాజధాని నిర్మాణంలో అవినీతిపై చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని కోటం రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబుకు జగన్‌ భయం పట్టుకుంది
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజన్న దొర,  చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ  పోరాడుతోందని గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికే బాబు ధర్మ పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేసినందుకుగాను చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top