ఆపని చేయడం బాబుకే సాధ్యం | Sakshi
Sakshi News home page

ప్రతిపనిలో అవినీతి చేయడం బాబుకే సాధ్యం

Published Thu, Jul 19 2018 11:49 AM

YSRCP Leaders Protest In Front Of Parliament Gandhi Statue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యక హోదా సాధనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని తీవ్ర తరం చేసింది. విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం తమ పదవులకు రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. పార్టీ మాజీ ఎంపీలు, వైవీ సుబ్బారెడ్డి మేకపాటి రామమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డిలతో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీపై ఎటువంటి వత్తిడి తేకపోవడం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్లే బీజేపీలో కనువిప్పు కలిగిందని అన్నారు. తమతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే రాజీనామా చేసి ఉంటే కేంద్రం ఎప్పుడో దిగి వచ్చేదని పేర్కొన్నారు. కానీ టీడీపీ మాత్రం అవకాశ రాజకీయం, ద్వంద వైఖరి రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు.

కడప ఉక్కు పరిశ్రమపై ఆరునెలల్లోపు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విభజన చట్టంలో ఉంటే నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండీ ఏమాత్రం పట్టించుకోని తెలుగుదేశం, ఒక పార్టీయేనా అంటూ ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా అధికారంలో ఉండాలన్న ఆశ తప్పితే, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన ధ్వజమెత్తారు. మొదటి సారి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు రెండో సారి వాజ్‌పేయ్‌ పుణ్యమా అని ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. తరువాత బీజీపీపై ఘాటు విమర్శలు చేసిన బాబు, 2014 ఎన్నికల్లో  మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ, మోదీ పంచన చేరిన చరిత్ర బాబుదని విమర్శించారు.

నాలుగేళ్ల పాటు కేంద్ర భాగస్వామిగా ఉన్న బాబు ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన నిధులన్నింటిని దోచుకొన్నారని ఆరోపించారు. పవిత్ర నదులకు వచ్చే పుష్కరాలను సైతం తన అవినీతికి వాడుకున్నారంటూ ధ్వజమెత్తారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఉపయోగించుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే.. వారితో కలిసి పొత్తుకు ప్రయత్నిస్తున్నారని మండిడ్డారు. ఏ ఎండకు ఆగొడుగు పట్టడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది వైఎస్సార్‌సీపీ అథినేత వైఎస్‌ జగన్‌ పోరాటం వల్లేనని వరప్రసాద్‌ గుర్తు చేశారు.

Advertisement
Advertisement