చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం: వైఎస్‌ షర్మిల

YSRCP Leader YS Sharmila Election Campaign Act Gudivada - Sakshi

సాక్షి, గుడివాడ:  తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఐదేళ్లు హోదాకోసం పోరాటం చేయకుండా.. ఎన్నికలు వస్తున్న వేళ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మాట.. పూటకోవేషం తీరు అన్న విధంగా చంద్రబాబు తీరుందని ధ్వజమెత్తారు. అద్భుతమైన పరిపాలన ఇచ్చి, పేదలను ఆదుకున్న రికార్టు వైఎస్సార్‌కే చెందుతుందని ఆమె గుర్తుచేశారు. ఎలాంటి తారతమ్య భేదం లేకుండా పాలన చేశారని అన్నారు. సీఎం అంటే అలా ఉండాలని.. బాబు అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కూడా విడుదల చేయట్లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్‌ షర్మిల రోడ్‌ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  గుడివాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానిని, మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సభలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీస వైద్య సదుపాయం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలేదు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదు. ఇంత అమానుషం దేశంలో ఎక్కడాలేదు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి.. రైతులకు నీళ్లు ఇస్తామాన్నారు. ఐదేళ్లు గడిచిన పూర్తి చేయలేకపోయారు. అమరావతి నిర్మాణానికి 3500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర చెబుతోంది. కానీ ఇప్పటి వరకు పర్మినెంట్‌గా ఒక్కభవనం నిర్మించలేదు. బాబు వస్తే నిరుద్యోగులకు జాబు వస్తుంది అన్నారు. కానీ ఆయన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఒక్క ఎన్నిక కూడా గెలవని లోకేష్‌కు ఏకంగా మూడు శాఖలను అప్పగించారు. పుత్రవాత్సల్యం అంటే ఇది కాదా. ఏపీకి హోదా ఊరిపి లాంటింది. దాన్ని నీరుకార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆయన స్వార్థ రాజకీయం కోసం తాకట్టుపెట్టారు. ఎన్నికలు రాగానే మళ్లీ హోదా కోసం దొంగ పోరాటం చేస్తున్నారు.

హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే. హోదాపై నిజం మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదు. బీజేపీ, టీఆర్ఎస్‌తో మాకు పొత్తు ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నించింది మీరు కాదా?. మాకు ఎవ్వరితోనూ పొత్తులు అవసరంలేదు. వైఎస్‌ జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లు ఏంచేశారు. 50 ఏళ్ల ఉమ్మడి ఏపీలో చేయని అప్పులు ఐదేళ్ల నవ్యాంధ్రప్రదేశ్‌లో చేశారు. 600 హామీలు ఇచ్చారు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. చేపలకు ఎర వేసినట్లు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రజల సమస్యల పట్ల పోరాటం చేశారు. మీ బాధలను చూసి చలించిపోయి మీకు సేవ చేయాలని తపిస్తున్నాడు. మళ్లీ రాజన్న రాజ్యంరావాలి అంటే వైఎస్‌ జగన్‌ రావాలి. పేదల బతుకులు మరాలి అంటే వైఎస్‌ జగన్‌ సీఎంకావాలి’’ అని షర్మిల అన్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top