వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ముగిసిన కీలక భేటీ | Sakshi
Sakshi News home page

6నెలలు, 3వేల కి.మీ: వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Wed, Oct 11 2017 3:22 PM

YSRCP key meeting over YS Jagan's Padayatra on November 2nd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన  ఈ భేటీలో నవంబర్‌ 2వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది.  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, అన్ని జిల్లాల  పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

6నెలలు..3వేల కి.మీ, 120 నియోజక వర్గాల్లో జగన్‌ పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవంబర్‌ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఎంపీ మేకపాటి తెలిపారు. ఆరు నెలల పాటు 3వేల కిలోమీటర్ల మీదగా 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అలాగే మిగతా 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చించారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతల సూచనలు, సలహాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

బూత్‌ కమిటీలు మరింత బలోపేతం
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ మేకపాటి పేర్కొన్నారు. ఏ పార్టీకి అయినా బూత్‌ కమిటీ ముఖ్యమైనదని, దాన్ని బలపడేలా చేసుకోవాలన్నారు. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని సవరించుకుని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఊరులోనూ వైఎస్‌ఆర్‌ సీపీ జెండా ఎగరాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, బోగస్‌ ఓటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు
ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడేలా చేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని, 21మంది ఎమ్మెల్యేలను ప్రలోబపెట్టి తమ పార్టీలోకి తీసుకున్నారన్నారు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఎంపీ మేకపాటి వ్యాఖ్యానించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే వైఎస్‌ఆర్‌ సీపీని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు.

వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వాలి
తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తారని మేకపాటి అన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్‌ జగన్‌కు  అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. వైఎస్‌ఆర్‌ లాగానే జగన్‌ కూడా మంచి పనులు చేస్తారని, పాదయాత్రలో ఆయన్ని అందరూ ఆదరించాలన్నారు.

చంద్రబాబు ‘హోదా’ను కాలరాశారు
కేసుల భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని కాలరాశారని విమర్శించారు. హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయన్నారు.  హోదా సాధించేవరకూ వైఎస్‌ఆర్‌ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే రాజీనామా చేస్తామన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను పంపిస్తామని అన్నారు.

ఎన్నికలను దిగజార్చారు...
చంద్రబాబు నాయుడు ఎన్నికలను కూడా దిగజార్చారని, సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని తెచ్చారన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కోట్ల రూపాయలు పంచారన్నారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో చంద్రబాబు కు కచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement