అంటే చంద్రబాబును జైల్లో పెట్టాలా?

YS Jagan Slams Chandra Babu On Dalit Comments - Sakshi

పెరికగూడెం(కైకలూరు నియోజకవర్గం), కృష్ణా : స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దళితుల పట్ల ఇంకా వివక్ష కనపడటం బాధాకరమని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. దళితులపై నేటికి దాడులు జరుగుతుండటంపై దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

మంచి అన్నది మాల అయితే నేను మాలగా పుట్టడానికి సిద్ధమన్న గురజాడ అప్పారావు మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకువస్తారని, అప్పుడు వచ్చి తనకంటే పెద్ద దళితుడు ఎవరూ లేరని అంటారని చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లను సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అమలుచేయని వారిని జైల్లో పెడతామని పేర్కొన్నారని గుర్తు చేశారు.

అంటే నాలుగేళ్లలో కనీసం ఒక్క ఏడాదైనా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్లను అమలు చేయని చంద్రబాబును ఇప్పుడు జైల్లో పెట్టాలా? అంటూ ప్రశ్నించారు. ఇదే ముఖ్యమంత్రి దళితుడిగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, నాయకుడు చూపిన బాటలోనే టీడీపీ నేతలు నడుస్తూ దళితులపై దారుణాలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తనని తాను చంద్రబాబు దళిత తేజంగా కీర్తించుకుంటున్నారని, ఇలాంటి వ్యక్తి దళిత తేజం అయితే దళితులందరూ ఎక్కడిపోవాలని ప్రశ్నించారు.

‘నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు దళితులకు ఎక్కడైనా మేలు చేసినట్టు కనిపించిందా?. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులు ఇబ్బందులు పడుతున్నారు. కారంచేడు ఘటన నుంచి ఇప్పటివరకూ అదే తరహాలో టీడీపీ పాలన సాగుతోంది.

ఏపీలో దళితులపై టీడీపీ నేతల జులూం..
- 2016 ఆగష్టులో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని జానకిపేటలో దళితులను టీడీపీ నాయకులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను అక్కడి వెళ్లి జరిగింది తెలుసుకున్నా. ప్రభుత్వాన్ని నిలదీశా. చంద్రబాబు కూడా తూర్పు గోదావరి జిల్లా వచ్చాడు. కానీ ఘటనాస్థలికి రాలేదు. కనీసం బాధితులను పరామర్శించలేదు.

- 2017 జులైలో ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూముల్ని నీరు-చెట్టు పథకం కోసం టీడీపీ ఎమ్మెల్యే లాక్కున్నారు. పథకం కోసం వేరే భూములు లేవా? అని అధికార పార్టీ అన్యాయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అక్కడి వెళ్లి అడ్డుకున్నారు.

- 2017 డిసెంబర్‌లో విశాఖపట్నం జిల్లాలోని జెర్రిపోతులపాలెంలో టీడీపీ నాయకుడు దళిత మహిళను బట్టలూడదీసి కొట్టాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా?. ఆమె భూమిని అక్రమించుకునేందుకు పశువులు మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు పాశవికంగా ప్రవర్తించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెళ్లి నిలబడితే అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు.

- 2018 జనవరిలో గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితుల మీద మూకుమ్మడిగా టీడీపీ నాయకులు దాడి చేశారు. 2018 జనవరిలోనే కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో నక్కలదిన్నెలో పారిశుధ్య పనులు చేయడానికి నిరాకరించారని దళితులను టీడీపీ నాయకులు గ్రామ బహిష్కరణ చేశారు. వారికి కనీసం మంచినీళ్లు కూడా అందనివ్వలేదు.

నాయకుడిని బట్టి పార్టీ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని అన్నారు. ఇక కిందిస్థాయిలోని టీడీపీ నాయకులు దళితులను ఎలా చూస్తారు. సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవన్నీ. ఎస్టీలకు తెలివి లేదు అని కుప్పంలో 2017 జులై 20న చంద్రబాబు మాట్లాడారు. తెలివి ఏమైనా చంద్రబాబు అత్తగారి సొత్తా?. ఈయనకు ఏం తెలివితేటలు ఉన్నాయి. 40 ఏళ్లుగా రాష్ట్రాన్ని, ప్రజానికాన్నీ దోచుకుతింటున్నాడు.

ఆయన కేబినేట్‌లోని మంత్రి ఆదినారాయణ దళితులు శుభ్రంగా ఉండరని, సక్రమంగా చదువుకోరంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవే మాటలు నా కేబినేట్‌లోని మంత్రి మాట్లాడి ఉంటే వెంటనే బర్త్‌రఫ్‌ చేసేవాడిని. దానివల్ల ఒక గట్టిసంకేతాన్ని నాయకుల్లోకి పంపినట్లు అవుతుంది. పేదవాళ్లను ఆప్యాయంగా పలకరించని వారు. వాళ్ల బాగోగులు తెలుసుకోని వారు సీఎం పదవిలో ఉండటానికి అనర్హులు.’ అని వైఎస్‌ జగన్‌ దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top