చరిత్ర పునరావృతం

YS Jagan Repeat NTR Victory in Elections - Sakshi

నాడు ఎన్టీఆర్‌ హవా,  నేడు జగన్‌ ప్రభంజనం

బాబు నేతృత్వ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిందేలేదు  

చిత్తూర్ జిల్లాలో ఈసారీ టీడీపీకి కోలుకోలేని చావుదెబ్బ

ఎన్టీఆర్‌ హయాంలో 1983 ఎన్నికల్లో జిల్లా నుంచి కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. తిరిగి 1994లో కాంగ్రెస్‌ నుంచి సీకే బాబు మాత్రం గెలిచారు. ప్రస్తుతం 14 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. కుప్పం నుంచి టీడీపీ తరఫున చంద్రబాబు మాత్రమే మిగిలారు.

చిత్తూర్ ,బి.కొత్తకోట: సమైక్య రాష్ట్రంలో ఎదురులేకుండా సాగిన కాంగ్రెస్‌ పాలనకు అడ్డుకట్టవేసిన టీడీపీ 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కోలుకోలేకుండా చేసింది. చిత్తూర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో ఒకసారి స్వతంత్య్ర అభ్యర్థి, ఇంకోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందగా, మిగిలినవాళ్లంతా టీడీపీ చేతిలో ఓటమిపాలయ్యారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత వైఎస్సార్‌సీపీ చేతిలో అడ్రస్‌ లేకుండా పోయింది. అభ్యర్థులు ఘోర పరాజయం పాలవగా, ముఖ్యమంత్రిగా కుప్పంలో పోటీచేసిన చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా మెజారిటీ  కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుత టీడీపీ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకునేలా లేదు.

1983లో మహామహులు ఓటమిపాలు
1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో మహామహులు ఓటమిపాలయ్యారు. ఇదే ఎన్నికలో సాధారణ వ్యక్తులూ ఎమ్మెల్యేలయ్యారు. జిల్లాలోని పుత్తూరు, వేపంజేరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, తంబళ్లపల్లె, వాయల్పాడు, పీలేరు, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క తంబళ్లపల్లెలో మాత్రం టీడీపీ గెలవలేకపోయింది. తంబళ్లపల్లె నుంచి కాంగ్రెస్‌ రెబల్‌గా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసిన టీఎన్‌ శ్రీనివాసులురెడ్డి ఒక్కరే గెలుపొందగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

1994లోనూ చిత్తూరు తప్ప..అన్నింటా ఓటమి  
జిల్లాలో 1983 నాటి రాజకీయ పరిస్థితి 1994లో టీడీపీతోనే పునరావృత్తం అయ్యింది. 1989 నుంచి 1994 నవంబర్‌ వరకు అధికారానికి దూరమైన టీడీపీ డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం కొనసాగించింది. అప్పటి నియోజకవర్గాలు తంబళ్లపల్లె, వేపంజేరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, నగరి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, సత్యవేడు, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే చిత్తూరు మినహా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను చిత్తుగా ఓడించి టీడీపీ గెలిచింది. ఒక్క చిత్తూరులో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి సీకే బాబు విజయం సాధించి జిల్లాలో ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.

2019లో టీడీపీ ఘోర పరాజయం
ఎన్టీ రామారావు సారధ్యంలో జరిగిన 1983,1994 ఎన్నికల్లో టీడీపీ కొనసాగించిన ప్రభంజనం 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఘోరంగా, కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. కుప్పంలోనూ చంద్రబాబు మెజారిటీకి అడ్డుకట్ట పడింది. ప్రతి ఎన్నికలోనూ జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించే చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మెజ్టారిటీ తగ్గిపోగా తంబళ్లపల్లె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి చంద్రబాబు సహా జిల్లాలో అందరికంటే అత్యధిక మెజారిటీ దక్కింది. జిల్లాలో టీడీపీ ఎప్పుడు గెలిచినా చంద్రబాబు మినహా ఎవరూ అధిక మెజారిటీ సాధించిన దాఖలాలు లేవు. ఈ ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా చంద్రబాబును మించిన అత్యధిక మెజారిటీ సాధించడం రికార్డు.

1995 నుంచి గెలుపు కష్టంగానే...
1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నుంచి సొంత జిల్లాలో జరిగిన 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను గెలవలేకపోయారు. ఎన్టీఆర్‌ హయాంలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోతే...చంద్రబాబు హయాంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభంజనానికి టీడీపీ గల్లతయ్యింది. సమైక్య, విభజనానంతర ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి సొంత జిల్లాలో నిరాదరణ తప్పలేదు. 1983 ఎన్నికల్లో తంబళ్లపల్లెలో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిస్తే, 1994లో కాంగ్రెస్‌ నుంచి సీకే.బాబు గెలిచి అప్పటి కాంగ్రెస్‌కు ఏకైక దిక్కయ్యారు. అదే దుస్థితి టీడీపీకి కలగగా, పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు ఒక్కరే జిల్లాలో గెలిచి ఆ పార్టీ మొత్తానికి దిక్కయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top