‘చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం లేవు’ | YS Jagan Mohan Reddy Slams Chandrababu On Elections Promises | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం లేవు’

May 12 2018 7:03 PM | Updated on Jul 26 2018 7:14 PM

YS Jagan Mohan Reddy Slams Chandrababu On Elections Promises - Sakshi

సాక్షి, గన్నవరం : గత ఎన్నికల్లో హామిలిచ్చి రాష్ట్ర ప్రజలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో.. అందుకు కైకలూరు ఓ ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో టీడీపీ ఎంపీలు నాలుగేళ్లు మంత్రులుగా కొనసాగారనీ, కానీ ఆ సమయంలో చంద్రబాబుకు కైకలూరు, కొల్లేరు సమస్యలు గుర్తుకురాలేదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కొల్లేరు పరిసర ప్రాంతాలవారు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర 159వ రోజు పాదయాత్రలో భాగంగా కైకలూరు గాంధీబొమ్మ సెంటర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. తిరుపతికి వస్తే అమిత్ షాపై రాళ్లదాడి చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు. కానీ అది తన పనేనని చెప్పుకునే దమ్ము, ధైర్యం ఏపీ సీఎంకు లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హయాంలో రెండో పంటకు నీళ్లు అందడం లేదని రైతులు వాపోతున్నారు. రైతన్నను పట్టించుకోని ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనని చెప్పారు. స్థానికుల సమస్యలను చూసి చలించిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా చంద్రబాబు.. పులిచింతల నుంచి రైతులకు చుక్కనీరు ఇచ్చిన పాపాన పోలేదని చెప్పారు. తెలంగాణకు రూ.145 కోట్ల బకాయిలు చెల్లించి, వేల ఎకరాలకు అవసరమయ్యే నీళ్లను నిల్వ చేయలేని అసమర్ధుడు ఏపీ సీఎం అని విమర్శించారు.

ఆక్వా రంగంలో దళారీ వ్యవస్థ
చంద్రబాబు ఆక్వా రంగంలోనూ దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రొయ్యలు, చేపల రైతులను కూడా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగానే రొయ్యలు, చేపలు వేశామని రైతులు చెబుతున్నారు. కానీ నీళ్లులేని పరిస్థితుల్లో నష్టపోతున్నాం. చేపలు, రొయ్యలు బతకడం లేదని, వైరస్‌ల ప్రభావం మమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. 110 రూపాయలు ఉండాల్సిన చేపల ధర 80రూ. ఉందని, 450 రూపాయల ధర ఉండాల్సిన రొయ్యలు కేవలం 200 ధర ఉంటే ఎలా బతకాలని రైతులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారని వైఎస్ జగన్ తెలిపారు.

వైఎస్ ప్రసంగంలోని మరిన్ని అంశాలివే..

  • 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని చంద్రబాబు చెబుతున్నారు. మీకు ఎక్కడైనా కనీసం లక్ష ఉద్యోగాలైనా కనిపించాయా
  • కొల్లేరు వాసులనే ఎమ్మెల్సీ చేస్తామని, కొల్లేరు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే కొల్లేరును రీ సర్వే చేయిస్తాం. కాంటురు హద్దులను న్యాయంగా నిర్ణయిస్తాం. ఉప్పు నీళ్లతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
  • ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అంటారు చంద్రబాబు. ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అడుగుతారు. కానీ హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి.
  • కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సబబేనా..
  • పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజీనామా చేసి హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మరి నాలుగేళ్లు కేంద్రంలో పదవులు పొందిన టీడీపీ నేతలు, ఆ పార్టీ ఎంపీలు ఏం సాధించారు.

  • అమిత్ షా తిరుపతి వస్తే చంద్రబాబు రాళ్లేపిస్తారు. ఒప్పుకునే ధైర్యమూ లేదు. అమిత్‌ షాపై దాడిని ఖండిస్తున్నా అని చంద్రబాబు చెబుతారు. అంతా పథకం ప్రకారమే చేస్తారు చంద్రబాబు
  • ఉప్పుటేరు ముఖద్వారం వద్ద రెగ్యులేటర్ కడతాం
  • దళారీలకు నాయకుడు చంద్రబాబే. ఆక్వారంగంలోనూ దళారీ వ్యవస్థ పేట్రేగి పోతోంది
  • కైకలూరులోని ప్రభుత్వ ల్యాబ్‌ ముసేశారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో కైకలూరులో వలసలు ఎక్కువయ్యాయి.
  • పెట్టుబడులు, ఉద్యోగాల విషయంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.
  • కైకలూరు నియోజకవర్గంలో 94 గ్రామాలకు మంచినీరే లేదు
  • మనం అధికారంలోకి వచ్చాక తాగునీరు సమస్య లేకుండా చేస్తాం. రెండు పంటలకు నీళ్లు ఇస్తాం. పంటలకే కాదు.. చేపల చెరువులకు నీళ్లు ఇస్తాం
  • నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు. 87, 612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయా?. చంద్రబాబు చెప్పినట్లుగా బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇప్పటికైనా ఇంటికొచ్చిందా..
  • పేదవాడి కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు
  • పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై రూ.7 అధికంగా వసూలు చేస్తున్నారు. రుణమాఫీ పథకం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రుపాయి కూడా మాఫీ కాలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement