విత్తన సమస్య పాపం బాబు సర్కారుదే | Sakshi
Sakshi News home page

విత్తన సమస్య పాపం బాబు సర్కారుదే

Published Fri, Jul 12 2019 3:58 AM

YS Jagan Mohan Reddy Slams On Chandrababu In Assembly - Sakshi

సాధారణంగా ఈ సంవత్సరం జూన్‌లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్‌లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్‌ కల్లా పూర్తి చేయాలి. మే నెలలో వాటిని పంపిణీ చేయాలి. కానీ, గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారు.

అమరావతి :  రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం ఇక్కట్లు పడుతుండటానికి గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. సాధారణంగా ఈ సంవత్సరం జూన్‌లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్‌లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్‌ కల్లా పూర్తి చేయాలని, మే నెలలో పంపిణీ చేయాలని చెప్పారు. వాస్తవంలో అలా జరగక పోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం జూన్‌లో వచ్చింది. అంటే మా ప్రభుత్వం వచ్చినప్పటికే విత్తన సేకరణ పూర్తయి రైతులకు పంపిణీ జరుగుతుండాలి.

అలా జరగనందునే రైతులు రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మేం బాధ్యతలు స్వీకరించిన నాటికి 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది. తీరా చూస్తే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని అధికారులు చెప్పార’ని వివరించారు. నిధులు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు గత ప్రభుత్వానికి రాసిన లేఖతోపాటు మరో లేఖను కూడా స్పీకర్‌ అనుమతితో టీవీ స్క్రీన్‌పై చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆంగ్లంలో చదివి వినిపించారు. అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఇన్నిన్ని లేఖలు రాశారంటూ లేఖల కట్టను చేత్తో పట్టుకుని పైకెత్తి చూపించారు.

గత ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం వల్ల రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉంటే కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితిలో మేం అధికారంలోకి వచ్చాం. ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించనందున ఏమీ చేయలేకపోయామని అధికారులు చెబుతుంటే చాలా బాధనిపించిందని సీఎం వివరించారు.  
 

Advertisement
Advertisement