వ్యవస్థను మారుద్దాం

YS Jagan Mohan Reddy Meeting With Collectors And SPs - Sakshi

మండల స్థాయి నుంచే అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే

‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

పై స్థాయిలో.. రాష్ట్ర స్థాయిలో నేను నడుం బిగించా

ఇది సఫలీకృతం కావాలంటే మీ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి

ఏ అర్జీ అయినా లంచం లేకుండా వెంటనే పరిష్కారం కావాలి

దిగువ స్థాయి సిబ్బందికి కౌన్సెలింగ్‌ ఇవ్వండి

త్వరలో పాజిటివ్‌ రిపోర్టు రావాలి..  పరిస్థితులు మార్చాలి

ఆత్మహత్య చేసుకున్న రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించండి

ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి రూ.7 లక్షల పరిహారం అందజేయండి

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్‌ అప్రూవల్స్‌కు కూడా లంచాలు అడుగుతున్నారు.. సర్టిఫికెట్‌ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులో లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనిని పూర్తిగా నివారించడానికి నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నా. దీనివల్ల 50 శాతం మాత్రమే ఫలితం ఉంటుంది. కింది స్థాయిలో మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలే.  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : అవినీతిని అసలు ఉపేక్షించేది లేదని, మండల స్థాయి నుంచే వ్యవస్థను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. దిగువ స్థాయి సిబ్బందికి కౌన్సెలింగ్‌ చేయాలని, రెండు మూడు నెలల్లో పాజిటివ్‌ రిపోర్టు రావాల్సిందేనని,ఇందుకు అనుగుణంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఏ అర్జీ అయినా లంచం లేకుండా పరిష్కారం కావాలన్నారు.  ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీసేవలో ఫలానా సర్టిఫికెట్‌ కావాలని దరఖాస్తు పెడితే.. మళ్లీ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి లంచం ఇస్తేకాని పని కావడం లేదని చెబుతున్నారని, ఇలాంటివి ఎక్కడా జరక్కుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాంటి అధికారులను పిలిపించుకుని కౌన్సెలింగ్‌ చేయాల్సిందిగా సూచించారు. ‘నాస్థాయి నుంచి నేను మొదలు పెట్టాను.. మీ స్థాయిలో మీరు మండల స్థాయి అధికారులను పిలిపించుకుని మాట్లాడండి.. రెండు మూడు నెలల్లో నాకుపాజిటివ్‌ రిపోర్ట్‌ కావాలి.. మండల కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయని నాకు నిఘా అధికారులు నివేదిక ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి.. ఇలా జరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది’ అని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పరిస్థితి మారాలి
ఏ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదన్న పరిస్థితి ఉందని, దీన్ని ఎలా అరికట్టాలో, ఈ పరిస్థితిని ఎలా మార్చాలో సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. కలెక్టర్లను కోరారు. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్‌ అప్రూవల్స్‌కు కూడా లంచాలు అడిగే పరిస్థితి ఉందని, దీన్ని కూడా పూర్తిగా నివారించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశం ఇవ్వాలని, నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నానని, దీనివల్ల జరిగేది 50 శాతం మాత్రమేనని చెప్పారు. మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలేనని, మీరు మనసు పెడితే ఇది సాధ్యమేనన్నారు. పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో అవినీతి ఆగిపోవాల్సిందేనని, ఎస్పీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎమ్మార్వో లెవల్లో అవినీతి ఆగిపోతే కలెక్టర్‌ గురించి, పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలో అవినీతి ఆగిపోతేనే ఎస్పీ గురించి ప్రజలు బాగా చెబుతారని ముఖ్యమంత్రి అన్నారు. ‘స్పందన’ కింద వినతులు తీసుకుంటున్న సిబ్బందికి కచ్చితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్గదర్శకాలు చెప్తూ.. అవినీతిని అంతం చేయాల్సిన అంశాన్ని కూడా వారికి వివరించాలని సూచించారు. వచ్చే వారంలో ఒకరోజు నిర్ణయించుకుని ఆ మేరకు అధికారులను పిలిపించుకుని ఈ విషయాలు చెప్పాలిందిగా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్లు స్పందన కార్యక్రమాన్ని మిస్‌ కావొద్దని, వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలని, ప్రతి రశీదు మీద తేదీ ఉండాలని సూచించారు. కలెక్టర్లు అందరూ బాగా పని చేస్తున్నారని సీఎం అభినందించారు. 

మనసుపెట్టి వినతులు పరిష్కరించండి
వినతుల పరిష్కారంలో లోపాలను ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. విజయవాడ సెంట్రల్‌ నుంచి ఒక వినతి వచ్చిందని, బినామీ డీలర్‌ రేషన్‌ షాపు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారని, సరైన పత్రాలు చూపించలేదని ఫిర్యాదును తిరస్కరించామంటూ అధికారులు పేర్కొన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. ఫిర్యాదుదారు ఎలా పత్రాలు చూపిస్తారు? విచారణ చేయాల్సిన బాధ్యత అధికారులదే కదా.. మనం విచారణ చేయకుండా పిటిషన్‌ను రిజెక్ట్‌ చేస్తే దీనివల్ల ఏం ప్రయోజనం..? అని ప్రశ్నించారు. మనసు పెట్టి ప్రజల వినతులను పరిష్కరించాలని చెప్పారు.

స్పందన కార్యక్రమం నిర్వహణలో నాణ్యత లేకపోతే ఉపయోగం ఉండదన్నారు. కలెక్టర్లు, అధికారులు మనసుపెట్టి పని చేయాలని, ఎవరైనా బాధపడుతూ మన దగ్గరకు వచ్చారంటే.. మనం ఫీల్‌ అయ్యి ఆ వినతిని పరిష్కరించాలని చెప్పారు. ఆ సమస్యను ఎప్పుడు (టైంలైన్‌) పరిష్కరిస్తామో రశీదులో స్పష్టంగా ఇవ్వాలని, దానిని తప్పనిసరిగా ఫాలో కావాలని సీఎం సూచించారు. ‘స్పందన మొదటి కార్యక్రమం ద్వారా 4,400కు పైగా వినతులు వచ్చాయి. వీటిని 7 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పాం. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. స్పందన కార్యక్రమం కింద వినతి పత్రం ఇచ్చాక ప్రజలకు కాన్ఫిడెన్స్‌ ఇవ్వాలి. ఒక స్పందనలో వచ్చిన వినతులకు వచ్చే స్పందన కల్లా.. క్లియర్‌ టైం లైన్‌ ఇవ్వాలి. వినతుల పరిష్కారానికి ఒక పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించుకోవాలి. దీని తర్వాత ఆకస్మిక తనిఖీలు క్రమం తప్పకుండా చేయాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. 

గ్రామ సచివాలయాల్లోనే రేషన్‌కార్డు 
పెన్షన్లు, హౌసింగ్, రేషన్‌కార్డుల మీద వినతులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటి  పరిష్కారానికి గ్రామ సచివాలయాలను డైనమిక్‌గా ఉపయోగించుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. రేషన్‌కార్డు, పెన్షన్‌ ఏం అడిగినా 72 గంటల్లోగా పరిష్కరించాలని చెప్పారు. స్కానర్, ప్రింటర్, కంప్యూటర్, లామినేటెడ్‌ యంత్రం కూడా గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని సీఎం పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్‌కార్డు ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిపై అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రతి విషయానికి సంబంధించిన జాబితా గ్రామ సచివాలయంలో ఉంచుతామని, దీనివల్ల కంటిన్యూగా సోషల్‌ ఆడిట్‌ జరుగుతుందని చెప్పారు.

అర్హులకు పథకాలు అందని పరిస్థితి ఉండకూడదన్నారు. గ్రామ వలంటీర్లను కచ్చితంగా దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నామని, వారిని సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల కోసం ప్రతి జిల్లాకు రూ.15 కోట్లు ఇస్తున్నామని, కలెక్టర్లు తనిఖీలకు వెళ్లేలోపు వాటికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోవాలని, ఆ మేరకు నిధులను ఖర్చు చేయాలన్నారు. స్పందన ద్వారా వినతులు ఇవ్వడానికి వస్తున్న ప్రజలకు సౌకర్యాలు లేవని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఇకపై స్పందన కేంద్రం వద్ద షామియానా, నీళ్లు, కుర్చీలు ఉండేలా చూసుకోవాలని, మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి మండలంలో కూడా స్పందన కార్యక్రమం చేపట్టాలని, ఎక్కడా నిర్వహించలేదన్న ప్రశ్న తలెత్తకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం
2014–2019 మధ్య కాలంలో డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, 391 మంది రైతుల కుటుంబాకు మాత్రమే గత ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అన్నారు. దీన్నిబట్టి చూస్తే గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్లు అర్థం అవుతోందన్నారు. మీ మీ జిల్లాల్లో డేటాను పరిశీలించాలని, ఎవరైనా అర్హులైన రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇచ్చి వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెప్పారు. ‘ఎక్కడైనా సరే.. రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్‌ స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఆ పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నాం. రైతుల విషయంలో సానుభూతి, మానవీయతతో ఉండాలి. మనిషే చనిపోయిన తర్వాత.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదు. మనం ఇచ్చే పరిహారం ఆత్మహత్యలను ప్రోత్సహించేందుకు ఎంతమాత్రం కాదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆత్మస్థైర్యం ఇవ్వడమే మన ఉద్దేశం’ అని సీఎం స్పష్టీకరించారు. 

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబ్బు లేనిదే పని జరగడం లేదు.. పట్టణ ప్రాంతాల్లో ప్లాన్‌ అప్రూవల్స్‌కు కూడా లంచాలు అడుగుతున్నారు.. సర్టిఫికెట్‌ కోసం ఇ–సేవలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులో లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీనిని పూర్తిగా నివారించడానికి నా దగ్గర నుంచి నేను చాలా బలంగా సంకేతాన్ని ఇస్తున్నా. దీనివల్ల 50 శాతం మాత్రమే ఫలితం ఉంటుంది. కింది స్థాయిలో మిగిలిన 50 శాతం చేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలే.మనసు పెట్టి పని చేస్తే ‘స్పందన’లో వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించవచ్చు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు మిస్‌ కాకూడదు. వస్తున్న వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ప్రతి రశీదు మీద తేదీ ఉండాలి. మళ్లీ వచ్చే స్పందన నాటికి గత వారం అర్జీలు పరిష్కారమయ్యేలా చూడాలి. రైతులు కానీ, కౌలు రైతులు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కచ్చితంగా జిల్లా కలెక్టర్‌ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలి. మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనది ప్రజల ప్రభుత్వం. మానవత్వం ఉన్న ప్రభుత్వం. ఈ దిశగానే పాలన ఉంటుంది.

‘స్పందన’ లేని ఏఎస్‌వో సస్పెన్షన్‌ 

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ (ప్రజా అర్జీల స్వీకరణ) కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గతనెల 29న స్వీకరించిన అర్జీలను అధికారులు ఏవిధంగా పరిష్కరించారనే దానిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తుండగా.. పౌర సరఫరాల విభాగంలోని ఏఎస్‌వో నిర్లక్ష్యం బయటపడింది. దీంతో సంబంధిత అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. గతనెల 29న విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఓ వ్యక్తి  హాజరై.. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 250 నంబర్‌ రేషన్‌ డిపోను బినామీ పేరుతో నడుపుతున్నారని, సంబంధిత డీలర్‌ నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్‌తో రేషన్‌ షాపు పొందారని ఫిర్యాదు చేశారు.

ఆ అర్జీపై అసిస్టెంట్‌ సప్లై ఆఫీసర్‌ (ఏఎస్‌వో) ఉదయభాస్కర్‌ విచారణ జరపకుండా, దరఖాస్తులో సరైన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ తిరస్కరించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అర్జీల పరిష్కారాల తీరును పరిశీలిస్తున్న క్రమంలో ఈ ఫిర్యాదును పరిశీలించారు. బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఫిర్యాదుదారు ఆధారాలు చూపలేదంటూ ఏఎస్‌ఓ ఉదయభాస్కర్‌ ఆ అర్జీని తిరస్కరించడం సరైన పద్ధతి కాదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పందిస్తూ.. అర్జీని పూర్తిగా పరిశీలించకుండా తిరస్కరించిన సంబంధిత అధికారిని సస్పెండ్‌ చేయాలంటూ పౌర సరఫరాల శాఖ ఇన్‌చార్జి, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సరైన విచారణ చేయకుండా అర్జీని తిరస్కరించడం వల్లే ఏఎస్‌వోపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.డీలర్‌పై వచ్చిన ఫిర్యాదు నిజమో, కాదో ఇంకా తెలియదని, దీనిపై విచారణ జరపాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్పందన అర్జీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారులు ప్రతి అర్జీని పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా అర్జీని తిరస్కరించడమంటే.. విధి నిర్వహణలో ఏఎస్‌వో ఉదయభాస్కర్‌ అలక్ష్యంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. ఈ విధంగా మరొకరు చేయకుండా ఉండేందుకు ఏఎస్‌వోపై చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top