
సాక్షి, వెల్దుర్తి : ‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా. వర్షాలు, రైతులు గోవిందా. ఇళ్ల నిర్మాణాలు గోవిందా. పెన్షన్లన్నీ గోవిందా. ప్రజా సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలను గోవిందా అనిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ‍్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేని వ్యక్తి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితులు రావాలని, అప్పుడే రాజకీయాలపై, నేతలపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. వ్యవస్థ మారాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతలనే ప్రజలు ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. తనపై ప్రేమాభిమానులు చూపిస్తున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితుడికి చేతులు జోడించి శిరసువంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 16వ రోజు పత్తికొండ నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వెల్దుర్తిలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
‘చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విసిగెత్తిపోయారు. ఓ వ్యక్తి నాలుగేళ్ల కింద సీఎం పదవి కోసం చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెబుతూ ప్రతి సమాజిక వర్గాన్ని మోసం చేశారు. సీఎంగా నాలుగేళ్లు చేశాక చంద్రబాబు.. ఏ హామీలు అమలు చేశాడని ప్రశ్నించారు. సంవత్సరంలోపు ఎన్నికలు జరుగుతాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మార్కెట్లోకి వెళ్లినప్పుడు త్రాసును చూడండి. బరువున్న వస్తువు ఓవైపు ఉంటే.. బరువు లేని వైపు పైకి లేస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల బతుకులు త్రాసు మాదిరిగానే గాల్లోకి లేస్తున్నాయి. అంటే ఇళ్లు, భూములు, నిత్యావసర సరుకులు లాంటివి ప్రభుత్వం మింగేయడంతో పేదల వైపు ఉన్న భాగం గాల్లోకి లేవకుంగా ఇంకే చేస్తుందని’ వైఎస్ జగన్ అన్నారు.
వైఎస్ జగన్ పేర్కొన్న మరిన్ని అంశాలు
- చంద్రబాబు పాలన తర్వాత నాన్న వైఎస్ఆర్ తొలిసారి సీఎం అయ్యాక.. విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకున్నారు.
- 24 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్థానిక క్రిష్ణగిరి రిజర్వాయర్ కూడా వైఎస్ఆర్ హయాంలోనే ప్రారంభమైంది.
- చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తూనే కరెంట్, ఆర్టీసీ చార్జీల బాదుడు మొదలైంది.
- మహానేత వైఎస్ఆర్ ఎంతో మందికి గ్యాస్ కనెక్షన్లు కల్పించారు. 104, 108 అంటూ వైఎస్ఆర్ ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు.
- రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు వైఎస్ఆర్. కానీ చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో విద్యార్థులకు ఫీజులు అందడం లేదు. వేల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు
- కుయ్ కుయ్ మంటూ రావాల్సిన అంబులెన్స్ రావడం లేదు. ప్రజలు కావ్ కావ్ మంటూ తమ ఆర్తనాదాలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. పరిశ్రమలు రాకుండా పోయాయి.. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి
- ఉద్యోగాలన్నీ హుష్ కాకీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భయంతో ఉంటున్నారు.
- ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. పేదలకు వైఎస్ఆర్ 32 లక్షల ఎకరాలు భూపంపిణి చేస్తే, ప్రస్తుతం పేదల భూములు లాక్కునే పాలనను బాబు తీసుకొచ్చారు.
- ప్రత్యేక హోదాను గాలికొదిలేశారు. గతంలో రేషన్ షాపులో దొరికే కందిపప్పు, చింతపండు, పామాయిల్ లాంటి ఎన్నో దొరికేవి. ప్రస్తుం బియ్యం తప్ప ఏం ఇవ్వడం లేదు.
- అన్యాయమైన పరిపాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం, అవ్వాతాతలకు రేషన్ సరుకులు, పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ఈ పాదయాత్ర చేపట్టాను
- అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కొందరు రైతులు అసెంబ్లీకి వెళ్లి తమ గోడు చెప్పుకుంటే నిర్ధాక్షిణ్యంగా జైలుకు పంపించారు. మరోసారి నిరసన చేపట్టం, ధర్నాలకు దిగకుండా ఉంటామని రాయించుకోవడం దారుణం
- మీ అందరికీ తెలుసు. చెరుకులపాడు నారాయణరెడ్డి అన్నను పట్టపగలే దారుణంగా హత్యచేశారు. చంద్రబాబు పరిపాలనలో ప్రశ్నించే హక్కులేదు. ప్రశ్నిస్తే హత్యలు చేసేదాకా వదిలిపెట్టరు.
- నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డికి మీ అందరి మద్ధతు, సహకారం అందించాలి. మరో ఏడాది ఓపిక పడితే మీ అందరి ప్రభుత్వం వస్తుంది. అందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తా.