మార్పునకు ఓటు.. విలువలకు పట్టం

YS Jagan Mohan Reddy Comments In Samara Sankharavam - Sakshi

కాకినాడ సమర శంఖారావం సభలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు 

రాష్ట్రంలో ఏ ఒక్కటీ వదలకుండా దోచుకుంటున్న చంద్రబాబు పాలనపై ప్రజల్లో చర్చ జరగాలి 

ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అసలు అర్హుడేనా? 

ఎన్నికలొస్తే గానీ ప్రజలు గుర్తుకు రాని, స్వార్థ్యం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటు వేయాలా?

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ అవినీతిపరుడు చంద్రబాబు నాయుడే 

ఓటుకు రూ.కోట్లు ఇస్తూ దొరికిపోయిన నేరగాడు, ఓట్లు తొలగించిన నంబర్‌ వన్‌ క్రిమినల్‌ 

రూ.వేల కోట్లు కుమ్మరిస్తున్నాడు.. దొంగ ఓట్లు చేర్పిస్తున్నాడు 

బాబు పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు చెప్పాలి 

ఎల్లో మీడియా చంద్రబాబును నెత్తిన పెట్టుకుని మోస్తోంది 

మానవత్వం లేని ఇలాంటి మనిషి రాజకీయాల్లో అవసరమా? అని చర్చించాలి 

‘‘మార్పునకు ఓటు వేయండి, విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి అని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ చెప్పాలి. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పాలి. పోగొట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఓటు వేయండి అని చెప్పాలి. అభివృద్ధి వైపు పరుగెత్తాలంటే ఓటు వేయండి అని చెప్పాలి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అభ్యర్థించాలి. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో నష్టపోయామా లేదా అనే దానిపై గుండెలపై చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోండి అని ప్రజలను కోరాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చిందని గుర్తుచేయాలి. చంద్రబాబు పరిపాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబే. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు పార్టీయే. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి. 

కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మార్పునకు ఓటు వేయాలి, విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పోగొట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్సార్‌సీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నష్టపోయామా లేదా అనే దానిపై ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలను దగా చేసిన చంద్రబాబు పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సాక్షిగా వైఎస్‌ జగన్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి సునామీలో ప్రత్యర్థులు చిత్తు కావడం తథ్యమని తేల్చిచెప్పారు. వైఎస్సార్‌సీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో విజయం కోసం అలుపెరగని కృషి సాగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో ఓటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సమర శంఖారావం సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. టీడీపీ అవినీతి పరిపాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఎన్నికల రూపంలో రాజ్యాంగం గొప్ప అవకాశం ఇచ్చిందని, దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సమర శంఖారావం సభలో జగన్‌ ఏం మాట్లాడారంటే... 

అక్రమ కేసులు ఉపసంహరిస్తాం..
తొమ్మిదేళ్లపాటు పార్టీ కార్యకర్తలంతా నాతోపాటు నడిచారు. అండగా నిలిచారు. తొమ్మిది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు మనల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయిన సంఘటనలు నాకు తెలుసు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని చూశా. మీ అందరికీ తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్టే. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ బాగోగులు చూసుకుంటానని మాట ఇస్తున్నా. మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చుకుంటానని హామీ ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటా. రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీపై పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులు అన్నీ ఉపసంహరిస్తామని గట్టిగా చెబుతున్నా. 

మన పాలన భిన్నంగా ఉంటుంది 
మన పాలనలో ప్రతి సంక్షేమ కార్యక్రమం, పథకం ప్రతి పేదవాడికీ సక్రమంగా అందాలి. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం వ్యవహరించదు. మన పార్టీ పాలన భిన్నంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడం అని అందరికీ గర్వంగా చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రైతులను, గ్రామాలను, మన కుటుంబాలను, వందలాది సామాజిక వర్గాలను, ప్రతి ఒక్కరినీ వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశం ఈ ఎన్నికలు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలి. 

మోసకారి బాబుకు బుద్ధి చెప్పాలి  
అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చాక దారుణంగా వంచించారు. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు అక్షరాలా రూ.87,612 కోట్లు ఉండేవి. అవన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ రుణాల మొత్తాన్ని ఏకంగా రూ.24 వేల కోట్లకు కుదించారు. ఆ సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు. నాలుగో విడత, ఐదో విడత కింద రూ.10 వేల కోట్లు బాకీ పడ్డాడు చంద్రబాబు. ఆయన చేసిన రుణ మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతులను మోసం చేయడానికి ఎన్నికల ప్రకటన వచ్చాక ఆదివారం మళ్లీ జీవో ఇచ్చాడు. ఇలాంటి మోసకారి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. 

ఓటర్లను ప్రలోభపెట్టడానికే బాబు డ్రామాలు 
ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో మనం ఎలా ఉన్నాం అనేదానిపై ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏం చెప్పారు? గద్దెనెక్కాక ఏం చేశారు అనేదానిపై ఆలోచన చేయాలి. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు నోటికి ఏదొస్తే అది చెప్పడం, ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేయడం ధర్మమేనా? అని ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మీ పట్టణంలో, మీ గ్రామంలో టీడీపీ నాయకులు ఐదేళ్లలో ఎలాంటి వాతావరణం సృష్టించారో చర్చించాలి. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలపై, జన్మభూమి కమిటీలు అనే మాఫియాలను పెట్టి ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నారో చర్చించాలి. ఇప్పుడు ఎన్నికల ముందు టీడీపీ నేతలు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చూపిస్తున్న డ్రామాలు, సినిమాలపై చర్చించాలి. ఇలాంటి విషయాలపై ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఒక పుస్తకం విడుదల చేస్తాడు. 2014లో బాబు విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికి హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఎలా మోసం చేయాలనే దానిపై పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు తీరుపై అన్నిచోట్లా చర్చ జరగాలి. టీడీపీ గత మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ప్రజలంతా చర్చించాలి. 

రాక్షస పాలన అవసరమా?  
రాష్ట్రంలో ఇవాళ మట్టిని వదలడం లేదు, ఇసుకను వదలడం లేదు. మద్యం, బొగ్గు వదలడం లేదు, కాంట్రాక్టర్లను వదలడం లేదు. గుడి భూములను, దళితుల భూములను కూడా వదలడం లేదు. పైన చంద్రబాబు కూర్చుంటారు, కింద టీడీపీ వాళ్లు ఉంటారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్ల మంజూరు, చివరకు మరుగు దొడ్లలోనూ దారుణంగా దోచేస్తున్నారు. అన్నిట్లోనూ లంచాలు గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయవచ్చా అనేదానిపై చర్చ జరగాలి. ప్రజల ఆస్తులను, భూములను, దేవుడి మాన్యాలను, స్థలాలను కొట్టేసే రాక్షస పాలన మనకు కావాలా అనేదానిపై చర్చించాలి. 

రాజధాని గారడీ 
పునాది గోడలను దాటి పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. అటువైపు చూస్తే రాజధాని అంటూ 50 వేల ఏకరాల భూములను అడ్డగోలుగా సేకరించారు. అందులో 49 వేల ఎకరాల్లో ఇవాళ గడ్డి, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో రాజధాని గారడీ కనిపిస్తోంది. పూర్తికాని పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో కూడా బీటలే దర్శనమిస్తున్నాయి. అక్కడ బయట 3 సెంటీమీటర్ల వర్షం పడితే, లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఏ ఒక్కటీ వదలకుండా దారుణంగా దోచుకుంటున్న చంద్రబాబు పాలనపై ప్రజల్లో చర్చ జరగాలి. 

శవ రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట 
చంద్రబాబుకు మమతలు లేవు, మానవత్వం లేదు. వీటికి అర్థం ఆయనకు తెలియదు. ఎన్టీఆర్‌ శవంపై రాజకీయాలు చేస్తాడు, హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు. ఇలాంటి మనిషి రాజకీయాల్లో అవసరమా అనే అంశంపై చర్చ జరగాలి. ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందన్న వారం ముందు చంద్రబాబు చేసిందేమిటో తెలుసా? అయనకు కావాల్సిన వ్యక్తులకు, బినామీలకు భూముల కేటాయింపులు చేస్తాడు, రాయితీలు ఇస్తాడు. ఎవరికి ఎన్ని భూములు, రాయితీలు ఇవ్వాలి, అందులో ఎన్ని లంచాలు గుంజాలి.. చంద్రబాబు నిర్వహించే కేబినెట్‌ సమావేశాల్లో మనకు కనిపించేది ఇదే. ఇలాంటి అంశాలపై చర్చ జరగాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేస్తున్న పాలన ఎలా ఉందో చర్చ జరగాలి.
 
బెల్టు షాపులు ఎక్కడ రద్దయ్యాయి బాబూ! 
పిల్లల చదువులకు ఆశాకిరణం ఫీజు రీయింబర్స్‌మెంట్‌. పిల్లలు పెద్ద చదువులు చదవాలి, పేదరికం పోవాలి. ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పరిస్థితి ఏమిటో అందరూ చర్చించాలి. మన ఆస్తులు అమ్ముకోకుండా, అప్పుల పాలు కాకుండా మన పిల్లలను చదివించుకోగలుగుతున్నామా? అనేది చర్చించాలి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్న వైనంపైనా చర్చ జరగాలి. అప్పులు చేయకుండా ఇవాళ వైద్యం చేయించుకోగలుగుతున్నామా? ‘108’కు ఫోన్‌ కొడితే కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి ఉందా? అనే అంశాలపై చర్చ జరగాలి. ఇప్పుడు ప్రతి పల్లెలో కనీసం మూడు నాలుగు మద్యం బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. బెల్టు షాపులను రద్దు చేస్తానంటూ మొదటి సంతకం చేసి తర్వాత దగా చేసిన చంద్రబాబు తీరుపై ప్రజలంతా చర్చించాలి. గ్రామాల్లో రాత్రి 7 గంటలు దాటితే మహిళలు బయట తిరగ్గలిగే పరిస్థితి ఉందా అనే దానిపై చర్చ జరగాలి. 

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ అవినీతిపరుడు 
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై (ఈవీఎం) చంద్రబాబు తరచూ మాట్లాడుతూ ఉంటాడు. ఈవీఎంలను దొంగిలించాడని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంద్రబాబు తన సలహాదారుడిగా నియమించుకున్నాడు. రూ.వేల కోట్లు కుమ్మరిస్తున్నాడు, ఉన్న ఓట్లను తొలగిస్తున్నాడు. లేని ఓట్లను చేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు, ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు. ఓటుకు రూ.కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన నేరగాడు. తనకు ఓటు వేయరని భావించిన ప్రజల ఓట్లను తీసివేయించిన నంబర్‌ వన్‌ క్రిమినల్‌. ఇలాంటి వ్యక్తిని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తలపై పెట్టుకుని మోస్తున్నాయి. పచ్చ మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర చానళ్లు బాబును భుజాన మోస్తున్నాయి. ఎల్లో మీడియా చంద్రబాబుతో కుమ్మక్కైంది. వీళ్లంతా కలిసి చేసేది ఏమిటో తెలుసా? రాబోయే రోజుల్లో లగడపాటి సర్వేలు తెరపైకి వస్తాయి. తెలంగాణ ఎన్నిల్లో లగడపాటి ఏం చేశాడో గుర్తుందా? ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు లగడపాటి మీడియా ముందుకొచ్చాడు. ఓ సర్వేను చూపించాడు. లగడపాటి సర్వేను ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. ఏ టీవీ ఛానల్‌ చూసినా, ఏ పత్రిక చూసినా లగడపాటి చెప్పాడంటూ సర్వే వివరాలే. చివరకు దేవుడు మొట్టికాయలు వేశాడు. లగడపాటి ఎలాంటివాడు, అతడి సర్వేలు ఎలాంటివి, ఈనాడు ఎలాంటిది, ఆంధ్రజ్యోతి ఎలాంటిది, టీవీ5 ఎలాంటిది అనేది అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడు. 

బాబు తయారు చేసిన జిత్తులమారి నక్కలు 
చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడడానికి, శాంతిభద్రతలను కాపాడడానికి లేరు. వాచ్‌మెన్‌ల కంటే దారుణంగా చంద్రబాబు వారిని వాడుకుంటున్నాడు. ఇంటెలిజెన్స్‌ వాళ్లు గ్రామాలకు వచ్చి సర్వేలు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవరు? 50, 100, 500 ఓట్లను ప్రభావితం చేసే వాళ్లు ఎవరు? వాళ్లను ఏ రేటుకు కొనాలి? ఎలా కొనాలి? అనే దానిపై సర్వేలు చేస్తున్నారు. చంద్రబాబు తయారు చేసిన జిత్తులమారి నక్కల గురించి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. తనకు ఓట్లు వేస్తారు అనుకుంటే చంద్రబాబు ఒకే ఓటర్‌కు రెండు ఓట్లు ఇప్పిస్తాడు. తనకు ఓటు వేయరు అనుకుంటే సామాజికవర్గాల వారీగా తీసేయిస్తాడు. ఇలాంటి వ్యక్తిని సైబర్‌ క్రిమినల్‌ అంటారు. మీరు చర్చ పెడుతూ అడగండి. మా ఆధార్‌ వివరాలు దొంగిలించడానికి, తనకు సంబంధించిన ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించండి. మన బ్యాంకు ఖాతా వివరాలు దొంగిలించడానికి, వాటిని ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అని నిలదీయండి. మన అనుమతి లేకుండా ఇవాళ మన వ్యక్తిగత డేటా చంద్రబాబుకు చెందిన ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లో ఉంది. దీనిపై గ్రామాల్లో ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన చంద్రబాబు పార్టీని రద్దు చేయాలి. చంద్రబాబు సేవామిత్ర అనే యాప్‌ తీసుకొచ్చాడు. ప్రజల వ్యక్తిగత డేటాను తన కంపెనీల్లో స్టోర్‌ చేసుకున్నాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి రేపోమాపో జైలుకు వెళ్లే నేరాలు ఇవి.  ఇలాంటి వ్యక్తికి ఓటు వేయాలా అని గ్రామాల్లో చర్చ పెట్టండి. 

బాబు సీఎంగా కొనసాగడానికి అర్హుడేనా?
ఓటుకు రూ.కోట్లు ఇస్తూ దొరికిపోయాడు చంద్రబాబు. అలాగే మన వ్యక్తిగత సమాచారాన్ని అన్యాయంగా, అనైతికంగా దొంగిలిస్తూ దొరికిపోయాడు. ఉన్న ఓట్లు తీసేస్తూ, దొంగ ఓట్లు చేరుస్తూ అడ్డంగా దొరికాడు. దేశంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశామా? ఇలాంటి అన్యాయమైన రాజకీయాల గురించి విన్నామా? అనేది చర్చించండి. దొంగ ఓట్లను తొలగించండి అని ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లపై చంద్రబాబు అన్యాయంగా కేసులు పెడుతున్నాడు. ఇలాంటి మనిషి సీఎంగా కొనసాగడానికి అర్హుడా అని చర్చ జరపండి. 

దొంగ ఓట్లను తొలగించాలి 
దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు తీరు ఎలా ఉందంటే.. తానే దొంగతనం చేస్తాడు, మిద్దెలెక్కి దొంగా దొంగా అని అరుస్తాడు, ఇతరులపై నేరం మోపుతాడు. రాష్ట్రంలో ఇవాళ అక్షరాలా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఇందులో 20 లక్షల ఓట్లు తెలంగాణలోనూ, మన రాష్ట్రంలోనూ కలిపి ఉన్నాయి. మిగిలిన 39 లక్షల దొంగ ఓట్లు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. దొంగ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి, తెలుగుదేశం పార్టీ కూటమికి మధ్య ఓట్ల తేడా ఎంతో తెలుసా? కేవలం 5 లక్షల ఓట్లు. 

ఇక చాలా సినిమాలు చూడబోతున్నాం..
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్ధం, వేయని డ్రామా ఉండదు. ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూడబోతున్నాం. ఇవన్నీ ఎల్లో మీడియాలో కనిపిస్తాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో కనిపిస్తాయి. వాళ్లంతా చంద్రబాబుకు అమ్ముడు పోయినవాళ్లే. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియాపై కూడా. ఈనాడుతో చేస్తున్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తున్నాం, టీవీ5తో చేస్తున్నాం, ఎల్లో మీడియాలోని ఇతర ఛానళ్లపై చేస్తున్నాం. 

నిరుద్యోగులు దగా పడ్డారు  
రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం చంద్రబాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తానని, అలా ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ, అమలు చేసిన పాపానపోలేదు. ఇప్పటిదాకా 60 నెలలకు గాను ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షల చొప్పున బాకీ పడ్డాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు జనాన్ని మోసం చేయడానికి పన్నాగం పన్నాడు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉన్నాయి. కానీ, వాటిని 3 లక్షలకు తగ్గించేశాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు కేవలం ఆ 3 లక్షల ఇళ్లకే నిరుద్యోగ భృతి అంటూ మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతి గ్రామంలో చాటిచెప్పాలి. 

‘ఫ్యాన్‌’ ప్రతి ఇంటికీ వెళ్లాలి 
బూత్‌ కన్వీనర్లు తమ పరిధిలోని 35 ఇళ్లకు వెళ్లినప్పుడు ఒక విషయం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ప్రజలకు తెలియజేయాలి. మన గుర్తు ప్రతి ఇంటికీ వెళ్లాలి, ఫ్యాన్‌ గుర్తు తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదు. ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీ పీఠాలు కదిలిపోవాలి. ఎన్నికల సంఘం వాళ్లు సీ–విజిల్‌ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్‌ను ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా అన్యాయం చేస్తున్నట్లు మీరు గుర్తిస్తే దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. తర్వాత 15 నిమిషాల్లోనే మీ దగ్గరికి ఒక టీమ్‌ వస్తుంది. చట్ట ప్రకారం.. దానిపై ఎలాంటి చర్య తీసుకున్నారో వివరిస్తూ రిటర్నింగ్‌ అధికారి 100 నిమిషాల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని ప్రజలకు గట్టిగా చెప్పండి. ప్రజలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పండి. నీతికి, అవినీతి మధ్య, విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయతను కాపాడాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పండి. రేపు నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాన్ని మార్చాలన్నా, ఈ వ్యవస్థను మార్చాలన్నా మీరంతా ఒక్కటై జగన్‌కు తోడుగా నిలబడాలి. ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు లాగా కేవలం విలన్‌ పాత్రే కాదు, మంచివాడు అధికార పీఠంపైకి వస్తే హీరో పాత్ర కూడా పోషించగలడని ప్రజలకు చెప్పండి. ఇది జరగాలంటే మీ అందరి తోడ్పాటు, సహాయం కావాలి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థించారు.  

ఓటు హక్కును సాధించుకోవాలి 
చంద్రబాబు నిన్ననే ప్రెస్‌మీట్‌ నిర్వహించాడు. ఆ ప్రెస్‌మీట్‌ చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత తానే తెలంగాణ ప్రభుత్వంతో రాజీ పడ్డానని, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పాడు. ఓట్ల కోసమే పసుపు–కుంకుమ కింద అధికారికంగా డబ్బులు పంచుతున్నానని ఒప్పుకున్నాడు. ఎన్నికలు వస్తేగానీ ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి నయవంచకుడికి, తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం సంకోచించని ఇలాంటి వ్యక్తికి ఓటు వేయాలా అని ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలి అనేది ఆలోచించండి. మనమంతా గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రతి 35 ఇళ్లకు చొప్పున మన పార్టీ తరçఫున ఒక బూత్‌ కమిటీ సభ్యుడు ఉన్నారు. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు తన పరిధిలోని 35 ఇళ్లకు వెళ్లాలి. ఆ ఇళ్లల్లోని నివాసితుల ఓట్లు ఉన్నాయో లేదో చూడాలి. ప్రతి ఓటర్‌ గుర్తింపు కార్డుపై ‘ఎపిక్‌’ నంబరు ఉంటుంది. ఆ నంబర్‌ను ‘1950’ అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. దాంతో ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. ఓటు లేకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. ఓటు కోసం ఫారం–6 సమర్పించాలి.  ఎమ్మార్వో ఆఫీసుల్లో, మన గ్రామాల్లో బూత్‌ లెవల్‌ అధికారి వద్ద కూడా ఫారం–6 ఉంటుంది. దాన్ని పూర్తి చేసి, సంబంధిత అధికారికి అందజేయాలి. ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ చంద్రబాబు మన ఓటును తీసివేయిస్తే మళ్లీ మనం ఓటు హక్కు పొందాలి. ఓటర్ల నమోదుకు ఐదు రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నమోదు నిలిపివేస్తారట. ఈ ఐదు రోజుల గడువును ఉపయోగించుకోవాలి. మన ఓటు హక్కును మనం సాధించుకోవాలి. మన ఊళ్లల్లో ఎవరికైనా రెండు ఓట్లు ఉన్నాయని తెలిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. 

గ్రామాలకు బాబు డబ్బు మూటలు పంపిస్తాడు 
ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చేయని అన్యాయాలు ఉండవు. మన గ్రామాలకు మూటల కొద్దీ డబ్బులొస్తాయి. చంద్రబాబు డబ్బు మూటలు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో కనీసం రూ.3,000 పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాలి, ప్రతి అమ్మకు, అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకూ చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవద్దని చెప్పాలి. రేపు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ.15,000 ఇస్తాడని చెప్పాలి. వైఎస్సార్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తాడు, ప్రతి అక్క చేతిలో రూ.75,000 నాలుగు విడతల్లో పెడతాడని చెప్పండి. ఎన్నికల తేదీ నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో ఆ సొమ్మును అన్న ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని చెప్పండి.

పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు చేస్తున్నది మోసమని వివరించండి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టాడని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలను అన్న మళ్లీ తీసుకొస్తాడని మహిళలకు చెప్పండి. బ్యాంకర్లు చిరునవ్వుతో మీకు అప్పులిచ్చేలా చేస్తాడని చెప్పండి. రాజన్న కుమారుడు జగనన్నతోనే ఇది సాధ్యమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పండి.  చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇస్తే మనల్ని మోసం చేశాడని తెలియజేయండి. చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవొద్దని ప్రతి రైతన్నకూ చెప్పండి. రేపు అన్న ముఖ్యమంత్రి అయ్యాక రైతు భరోసా కింద ప్రతి రైతు చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరకు, ప్రతి తాత దగ్గరకు వెళ్లండి. అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే పెన్షన్‌ రూ.3,000కు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. పేదలకు ఇల్లు రావాలంటే అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. నవరత్నాల్లోని అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. నవరత్నాల గురించి చెప్పండి. నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు చూస్తామని గట్టిగా నమ్ముతున్నా. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నవరత్నాలు అందేలా చేస్తానని మాట ఇస్తున్నా. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top