పార్టీ, ప్రభుత్వం మనకు రెండు కళ్లు

YS Jagan Mohan Reddy Comments On Party And Government - Sakshi

వైఎస్సార్‌ శాసనసభాపక్ష భేటీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బీసీ డిక్లరేషన్‌ దిశగా ఇది తొలి అడుగు

మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు డిప్యూటీ సీఎంలుగా అవకాశం

మంత్రి పదవులు రానివారు నిరాశ చెందొద్దు

ఇప్పుడు మంత్రులు కాబోతున్న వారు రెండున్నరేళ్ల తరువాత పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి

వారి స్థానంలో కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తాం

మన ప్రతి అడుగూ ప్రజలకు చేరువ కావాలి

ఇప్పుడు మనకు 50 శాతం ఓట్లు.. వచ్చే ఎన్నికల్లో ఇంకా పెరగాలి

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏలూరు ‘బీసీ గర్జన’ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అనుసరించి తొలి అడుగుగా మంత్రివర్గంలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందు ఒక రోజు ముందు అసాధారణ రీతిలో నిర్వహించిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో  ముఖ్యమంత్రి మాట్లాడారు. మంత్రివర్గం కూర్పు ఎలా ఉంటుంది? ఏ పద్ధతి అనుసరించబోతున్నారు? వివిధ సమీకరణలు, పరిమితులు, పాలనా వ్యవహారాల్లో పారదర్శకత తదితర అంశాలపై వైఎస్‌ జగన్‌ ముందుగానే ఎమ్మెల్యేలందరికీ వివరించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఘన విజయాన్ని చేకూర్చిన ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు అనుగుణంగా ప్రతి అడుగూ ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే...

ప్రతి పనిలోనూ ప్రజలకు చేరువ కావాలి..
‘‘రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు కంటే ముందుగానే 151 మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి ఆహ్వానించడానికి కారణాన్ని బహుశా మీరంతా ఊహించి ఉంటారని భావిస్తున్నా. అంతా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. 175 మందికిగానూ 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు మనకు పట్టం కట్టారు. ప్రజలకు దగ్గరవుతున్నామా లేదా అనే ఒకే ఒక్క ప్రామాణికతతో మన ప్రతి అడుగూ ముందుకు పడాలి. మనం చేసే ప్రతి పని, కార్యక్రమం వారికి దగ్గరవుతున్నామనే భావన కలిగించాలి. అది జరగాలంటే పరిపాలనలో భారీ మార్పులు తేవాలన్న సంగతి నేను వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ పది రోజులుగా మనం వేసే ప్రతి అడుగూ అదే దిశగా పడుతోంది. పరిపాలనలో పారదర్శకత తెస్తున్నాం. కింది నుంచి పైస్థాయి వరకూ ఎక్కడా అవినీతి లేకుండా చేసేందుకు అడుగులు వేస్తున్నాం. ఎవరూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.

దేశం మొత్తం మనవైపు చూడాలి...
దేశం మొత్తం మనవైపు చూడాలి, ఎక్కడా అవినీతికి తావులేకుండా చేయాలనే తాపత్రయంతో పని చేస్తున్నాం. ఏదైనా కాంట్రాక్టుకు సంబంధించి టెండర్‌ పిలవాలంటే పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. అందుకే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసి ఒక జడ్జిని కేటాయించాలని కోరాం. ప్రభుత్వం ఏదైనా విలువైన కాంట్రాక్టు ఇవ్వాలనుకున్నపుడు మా టెండర్‌ ఇదీ అని నేరుగా ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. న్యాయమూర్తి ఆ టెండర్‌ను బహిరంగ పరుస్తారు. అలా ఆ టెండర్‌ను వారం రోజులు పెడతారు. ఎవరైనా సరే మనకు వ్యతిరేకులైనా సరే.. టెండర్లలో మార్పు చేర్పులపై సలహాలు ఇవ్వవచ్చు. వారం రోజుల తరువాత తనకు అందిన సూచనలు, సలహాలను పరిశీలించి న్యాయమూర్తి క్రోడీకరిస్తారు. దీనికి సంబంధించి న్యాయమూర్తికి సాంకేతిక సహకారంతోపాటు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. న్యాయమూర్తి సూచనలను తు.చ తప్పకుండా పొందుపరిచిన తరువాతే టెండర్లను పిలుస్తాం. బహుశా ఇంత పారదర్శకంగా కాంట్రాక్టరును ఎంపిక చేసే విధానం ప్రపంచంలో ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు. ఆరు నెలల్లో దేశం మొత్తం మనవైపు చూసేలా చేస్తాం. ఆ స్థాయిలోకి పారదర్శకతను తీసుకెళతాం.
 
రివర్స్‌ టెండరింగ్‌తో ఖజానాకు ఆదా చేస్తాం..
చంద్రబాబునాయుడు పాలనలో విపరీతంగా అవినీతికి పాల్పడి రేట్లు పెంచేసి కాంట్రాక్టులు, టెండర్లు ఇచ్చేశారు. మనం కూడా కళ్లు మూసుకుంటే... మనకు లంచాలు ఇవ్వాలని ప్రయత్నిస్తారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఎక్కడైతే అవినీతి జరిగిందో, ప్రజాధనాన్ని దోచేసే ప్రయత్నం చేశారో వాటన్నింటినీ రద్దు చేస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం. దీనివల్ల 15 నుంచి 20 శాతం వరకు మిగిలినా ఖజానాకు ఆదా అవుతుంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉంది కాబట్టి రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా ఖజానాకు ఆదా చేసిందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా చేస్తాం. అంటే ఒక స్థాయి దాటి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం. ఇదంతా చేస్తోంది పారదర్శకత, అవినీతి నిర్మూలన కోసం. ప్రతి అడుగూ ముందుకు వేస్తూ పరిపాలనా విధానంలో కూడా మార్పులు తెస్తాం. 

మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, గీత 
పార్టీ మేనిఫెస్టో మనకొక బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిదని సంపూర్ణంగా విశ్వసిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతి అడుగూ అదే దిశగా వేస్తున్నాం. ప్రతి మాటా నిలబెట్టుకునే తాపత్రయంతో వ్యవస్థలోకి పూర్తి పారదర్శకత తెస్తున్నాం. ప్రతి అర్హుడికీ లబ్ధి చేకూరాలనే ఆలోచనతో శ్యాచురేషన్‌ (సంతృప్త స్థాయి) పద్ధతిలో అడుగు ముందుకేస్తున్నాం. మనం రూపొందించిన నవరత్నాల ద్వారా హామీలు అమలు చేసేందుకే అడుగులు వేస్తున్నాం. ప్రతి అడుగులోనూ మన ప్రతిష్ట పెరగాలి. ఎక్కడా తప్పు చేయకూడదు. మనం చేసే ప్రతి పని ద్వారా ప్రజలకు చేరువ కావాలి. 

రెండున్నరేళ్ల తరువాత మరో 20 మందికి అవకాశం
అత్యంత ముఖ్యమైన హామీని నేను ఏలూరులో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించినపుడు ఇచ్చా. నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తానని ప్రకటించా. అప్పుడు ఇచ్చిన మాట మొట్టమొదట మంత్రివర్గ కూర్పు నుంచే ప్రారంభం కావాలని భావిస్తున్నా. 50 శాతం కన్నా ఎక్కువగా ఇస్తే ఇంకా సంతోషించే పరిస్థితి వస్తుంది. సామాజికంగా ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి అడుగులోనూ అందరికీ అండగా ఉన్నామనే భావనను ప్రభుత్వం తరపున కల్పించాలని కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నపుడు 151 మంది ఎమ్మెల్యేలను సంతృప్తి పరచాలని నేను భావించినా ఒక్కోసారి చేయలేని పరిస్థితి ఉంటుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా.

ఈ సందర్భంగా మరొకటి కూడా చెబుతున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా కనుక నా మనసులో ఒక ఆలోచన కూడా ఉంది. 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ అందులో న్యాయం చేయలేకపోవచ్చు. కొంతమందికి న్యాయం జరగకపోయే పరిస్థితి ఉంటుంది. కానీ మనలో కూడా ఓ మార్పు తీసుకు రావాలి. రెండున్నర సంవత్సరాల పాటు ఈ క్యాబినెట్‌ పూర్తిగా కొనసాగుతుంది. ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో దాదాపు 90 శాతం మంది రెండున్నర ఏళ్ల తరువాత పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మరో 20 మందిని సంతృప్తి పరిచే పరిస్థితి వస్తుంది. రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే 25 మందికి ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారు.

పదవులు రాని వారికి ఒక్క వినతి..
మనం మళ్లీ 2024లో కూడా అధికారంలోకి రావాలంటే ఒకవైపు ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండంగా ఉంటూనే ప్రజల మన్ననలు పొందుతూ పార్టీ కూడా బలోపేతం కావాలి. అందరం ఏకమై పనిచేస్తేనే అది సాధ్యం. ఈ నేపథ్యంలో నేను చేసే సూచనలను సానుకూల దృక్పథంతో స్వీకరించాలని మనవి చేస్తున్నా. పదవులు ఆశించిన వారు రాలేదనే అసంతృప్తికి గురి కావద్దు. ఎందుకంటే కళ్లు మూసుకుంటే రెండున్నరేళ్లు అయిపోతాయి. అదేమీ పెద్ద సమయం కాదు. అపుడు కచ్చితంగా కనీసం 90 శాతం మందికి అవకాశం లభిస్తుంది. ఇపుడున్న వారిలో కనీసం 20 మందిని మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ 25 మందికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోజు మాత్రం ఎవరూ బాధపడొద్దు. బాధపడటం మొదలు పెట్టామంటే మన పార్టీని మనంతట మనమే నాశనం చేసుకున్న వాళ్లం అవుతాం. ఇంత ఘన విజయంతో ప్రజలు మనల్ని గౌరవించినందుకు వారికి మనం దగ్గర కావాలి. మనం వేసే ప్రతి అడుగూ ఆ దిశగానే ఉండాలి. అందరూ సహకరించాలని మనవి చేస్తున్నా. 

ఐదుగురు డిప్యూటీ సీఎంలు
మంత్రివర్గంలో నాతోపాటు ఐదుగురు ఉపముఖ్యమంత్రులుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనారిటీ, కాపు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటారు. మనం వేసే ప్రతి అడుగూ ఒక సంకేతం ఇవ్వాలి. ప్రజలకు చేరువ కావాలి. 

2024 ఎన్నికలే మన లక్ష్యం
2019 ఎన్నికలు అయిపోయాయి. ఇక 2024 ఎన్నికలు మన లక్ష్యం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిలో గట్టిగా కష్టపడాలి. మళ్లీ మంత్రివర్గ విస్తరణ జరిగేటపుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న కరణం ధర్మశ్రీ సూచనకు నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా. పార్టీ, ప్రభుత్వం రెండూ రెండు కళ్లు లాంటివి, ఇందులో ఏ ఒక్కటి పంక్చర్‌ అయినా మనిషి బతకడు. ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తుంచుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందనేది కాదనలేని సత్యం అని మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ కష్టపడండి. మీరు సాధించే ఫలితాలు తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయంలో కచ్చితంగా ఉపయోగపడతాయని ఘంటాపథకంగా చెబుతున్నా. ప్రజలు ఇపుడు మనకు 50 శాతం ఓట్లు వేసి గెలిపించారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు పొందేలా ప్రతి అడుగూ పడాలని, అందరమూ కలిసి కట్టుగా పని చేయాలని కోరుతున్నా. మీ సహాయ సహకారాలకు, మీ  మద్దతు, విశ్వాసానికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా’’ 

వైఎస్సార్‌ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో సహా పలువురు పాల్గొన్నారు. మొత్తం 151 మంది పార్టీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top