బీజేపీలో కొత్త ధీమా, బోపయ్యకు ఓకే..

Yeddyurappa, Siddaramaiah Take Oath As MLAs - Sakshi

సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమా కనిపిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది.

సాయంత్రం జరిగే బలపరీక్షలో తాము గెలిచి తీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఆదివారమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. సాయంత్రం సంబురాలు జరుపుకుంటామని ఆయన అన్నారు. కాగా బలపరీక్ష చేపట్టేందుకు ప్రొటెం స్పీకర్‌ బోపయ్యకే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
కర్ణాటక అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయిం‍ది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్‌ బోపయ్య...నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది.

కర్ణాటక అసెంబ్లీలో బలబలాలు

  • బీజేపీ 104, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 36, ఇతరులు 3
  • మొత్తం 222 సీట్లు, మ్యాజిక్‌ ఫిగర్‌ 111
  • రెండు స్థానాల్లో గెలిచిన కుమారస్వామికి ఒకే ఓటు
  • బలపరీక్షలో విజయంపై రెండు పక్షాల్లో ధీమా
  • ఇంకా తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌
  • సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష
  • తమకు 116 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్న కాంగ్రెస్‌-జేడీఎస్‌
  • భద్రతా వలయంలో కర్ణాటక విధాన సౌధ
  • రంగంలోకి 200మంది మార్షల్స్‌
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top