కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిది

Yanamala Says Centrall Will Decide Reservations Issue - Sakshi

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల

రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం చెప్పింది

ఇది రాష్ట్ర పరిధిలో లేని అంశం

ఇప్పటికే మరాఠాలు,పటేళ్లు రిజర్వేషన్ల కోసం పట్టుబడుతున్నారు

సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చే విషయం ఉమ్మడి జాబితాలోని అంశమన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై తమ పరిధిలో చేయాల్సిందంతా పక్కాగా చేశామని చెప్పారు.

‘‘ఈ విషయంలో రాష్ట్రం చేయాల్సింది చేశాం. చట్టం చేసి కేంద్రానికి పంపాం. మా పరిధిలో ఉండేది అది. తరువాత రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలనేది కేంద్రం పరిధిలోని అంశం’’ అని ఆయన అన్నారు. రాజ్యాంగ సవరణ రాష్ట్రం పరిధిలోని అంశం కాదని, అది కేంద్రం మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘రాజ్యాంగంలో క్లియర్‌గా ఉంది. ఈ అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంది. ఈ పని పార్లమెంటు మాత్రమే చేయాలి. అందుకోసం కేంద్రం ప్రతిపాదించాల్సి ఉంటుంది’’ అని అన్నారు. ‘‘ప్రస్తుతం మరాఠాలు, పటేళ్లు రిజర్వేషన్లుకోసం పట్టుపడుతున్నారు. అలాగే యూపీలోనూ, హర్యానాలోనూ, ఇంకా పలు రాష్ట్రాలలో ఇదే తరహా డిమాండ్లు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరిపి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదనేది వాస్తవమే. కానీ ఈ లిమిటేషన్లు తీసేసే అధికారం కేంద్రానికుంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం కేంద్రానికుంది. కేంద్రం అనుకుంటే చేయవచ్చు. అన్ని రాష్ట్రాలను సంప్రదించి చేయాల్సి ఉంటుంది. కానీ బీజేపీ ఎందుకు చేయడం లేదు?  కనీసం అవునా, కాదా అనేది కూడా ఎందుకు చెప్పడం లేదు?’’ అని యనమల ప్రశ్నించారు.

కేంద్రం అన్యాయం చేస్తున్నా వారు ప్రశ్నించరు..
కాపు రిజర్వేషన్లపై జగన్‌ ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని యనమల ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లపై గతంలో జగన్‌ అనుకూలంగా.. ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్రాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావట్లేదని యనమల విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు.  

పదో షెడ్యూల్‌లోని ఆస్తుల పంపిణీని పట్టించుకోవట్లేదు
విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని నేతలు సుప్రీంకోర్టును, పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని యనమల ఈ సందర్భంగా విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు. ఉన్నత విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదన్నారు.

విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపు తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకుని పరిష్కరించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇంతవరకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 9వ షెడ్యూల్‌లోని అంశాలను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. పదవ షెడ్యూల్‌లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి జనాభా ప్రాతిపదికన ఏపీకి 58%, తెలంగాణకు 42% ప్రకారం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం స్పందించట్లేదన్నారు. పంపిణీ చేయాల్సిన అవసరం లేదంటూ అఫిడవిట్‌లో పేర్కొనడం దారుణమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top