మోదీజీ..అమిత్‌ షా అంటే భయమెందుకు?

Why is PM Narendra Modi silent on Jay Shah controversy, asks Congress - Sakshi

సాక్షి,పనాజీ: బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కుమారుడిపై వచ్చిన ఆరోపణల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనందాల్చడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. జే షాపై నిష్పాక్షిక విచారణ జరిగేందుకు అమిత్‌ షా తన పదవి ఉంచి వైదొలగాలని డిమాండ్‌ చేసింది. షెల్‌ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రధాని తీవ్ర చర్యలు చేపడుతుంటే ఆ తరహాలోనే అమిత్‌ షా కుమారుడు జే షాకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అక్రమాలకు పాల్పడిందని ఏఐసీసీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకత గురించి మాట్లాడే ప్రధాని, అమిత్‌ షాలు ఈ ఆరోపణలపై విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.

అమిత్‌ షాను ప్రధాని ఎందుకు కాపాడుతున్నారని..తనకు సన్నిహితుడైన వ్యక్తిని జవాబుదారీగా ఉండాలని కోరేందుకు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. షెల్‌ కంపెనీలపై పోరాడుతున్నానని, డొల్ల కంపెనీలను మూసివేయిస్తానని చెబుతున్న ప్రధాని అమిత్‌ షా కుమారుడి డొల్ల కంపెనీలపై మౌనం దాల్చారని విమర్శించారు. జే షా డొల్ల కంపెనీలపై విచారణ చేపడితే వాటిలో డొల్లతనం నిగ్గుతేలుతుందని అన్నారు.ఈ వ్యవహారంలో విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు.

అమిత్‌ షా కుమారుడికి చెందిన కంపెనీ టర్నోవర్‌ కేవలం ఒక్క ఏడాదిలోనే (2015-16) రూ 50,000 నుంచి 80.5 కోట్లకు పెరిగిందన్న ఓ వెబ్‌సైట్‌ కథనం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఓ ఎన్‌బీఎఫ్‌సీ నుంచి హామీ రహిత రుణం పొందడం వల్లే టర్నోవర్‌ భారీగా పెరిగిందని దివైర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top