నల్ల జెండాలను చూస్తే వారికి భయం

Why Have BJP-Led State Governments Developed A Phobia About Black Flags? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ ముఖ్యమంత్రులకు ఇప్పుడు నల్ల జెండాల భయం పట్టుకున్నట్లుంది. ఎక్కడైన వారికి నల్ల జెండాల నిరసన ఎదురయితే భరించలేక పోతున్నారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పోలీసులు కూడా ఒకప్పుడు ఎర్ర జెండాలను చూస్తే రెచ్చిపోయినట్లుగా ఇప్పుడు నల్ల జెండాలను చూస్తే రెచ్చి పోతున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా గువాహటిలో శనివారం ఆయన కాన్వాయ్‌ ముందు నల్ల జెండాలను ప్రదర్శించినందుకు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారంతా విద్యార్థులే. అస్సాం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. వారు అంతకుముందు చొక్కాలు చింపుకొని అర్ధనగ్నంగా కూడా ప్రదర్శనలు జరిపారు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఓ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిరసన ప్రదర్శనల్లో విపరీత పోకడలు వద్దని, మౌనంగా నల్ల జెండాలతో ప్రదర్శన జరిపేందుకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు.

రాజస్థాన్‌లో, 2018, మార్చి నెలలో నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగానే ‘నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌’కు చెందిన కాంట్రాక్టు కార్మికులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని అరెస్ట్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగి లక్నో యూనివర్శిటీ సందర్శన సందర్భంగా గత జూన్‌ నెలలో 23 ఏళ్ల పూజా శుక్లా, మరో పది మంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని 26 రోజులపాటు జైల్లో పెట్టారు. ఆ మరుసటి నెల జూలైలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌ ముందు నెహా యాదవ్, మరో ముగ్గురు నల్ల జెండాలను ప్రదర్శించగా వారిని కూడా అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన శుక్లా, యాదవ్‌లను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైల్లో చితకబాదారట. ఎన్‌కౌంటర్‌ చేసి చంపేస్తామని బెదిరించారట.

ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన అందరిపైనా చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని, అల్లర్లకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డం పడ్డారని, ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారంటూ కేసులు దాఖలు చేయగా, రాజస్థాన్‌లోని ఆరోగ్య కార్యకర్తలపై ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చారని అభియోగాలు మోపారు. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం యూరప్‌ దేశాల్లో అనార్కిస్టు పార్టీల నుంచి వచ్చింది. యూరప్‌ వీధుల్లో మొదటిసారి 1982లో నల్ల జెండాల ప్రదర్శన జరిగినట్లు చరిత్రలో నమోదయింది. అప్పట్లో అనార్కిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేయడానికి నల్ల జెండాలనే కాకుండా ఎర్ర జెండాలను కూడా ప్రదర్శించేవారు. సోవియట్‌ యూనియన్‌లో అక్టోబర్‌ రెవెల్యూషన్‌ తర్వాత ఎర్ర జెండా కమ్యూనిస్టుల అధికారిక జెండాగా మారడంతో అనార్కిస్టులు ఎర్రజెండాను వదిలేశారు. అలా మొదలైన నల్లజెండాల ప్రస్థానం ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల నిరసనకు చిహ్నంగా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top