కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవం

Vishweshwar Hegde Kageri Elected As Karnataka Legislative Assembly Speaker - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే  ఏకైక నామినేషన్‌ దాఖలు..  ఏకగ్రీవ ఎన్నిక

సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్‌ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్‌ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్‌ రమేష్‌ కుమార్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్‌ను నూతన సభాపతిగా ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన సీఎంతో సహా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

అంకోలా నుంచి రాజకీయ ప్రస్థానం  
1961 జులై 10న జన్మించిన కాగేరి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లా అంకోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాగేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పునర్విభజన కారణంతో 2008లో సిర్సి–సిద్ధాపుర నియోజకవర్గం నుంచి తొలిసారిగా, ఆ తరువాత 2013, 2018లో అక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2008లో యడియూరప్ప మంత్రిమండలిలో ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి వచ్చిన కాగేరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

అయితే గతంలో స్పీకర్‌గా పనిచేసిన కే.జీ.బోపయ్యను సోమవారం వరకు అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంగళవారం ఉదయం బోపయ్యకు బదులుగా కాగేరిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత అమిత్‌ షా సూచనల ప్రకారమే ఈ మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top