చంద్రబాబు, కేసీఆర్‌ ఇద్దరూ దొంగలే

Vimalakka Fires on Chandrababu and KCR - Sakshi

     స్వప్రయోజనాల కోసం రాష్ట్రాలను వాడుకుంటున్నారు 

     అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క ధ్వజం

     ముగిసిన జన సమర యాత్ర

కాకినాడ రూరల్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు ఇద్దరూ దొంగలేనని, సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాలను వాడుకుంటున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ చైర్‌పర్సన్‌ విమలక్క ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా మల్లిసాల నుంచి కాకినాడ వరకు ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల కిందట చేపట్టిన జన సమర యాత్ర సోమవారం ముగిసింది. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముంగిట్లో చంద్రబాబు చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటం నీడతో యుద్ధం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.

పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగాల కల్పనలో భాగంగా జిల్లాల పునర్విభజన చేపట్టాలని కోరారు. రంపచోడవరాన్ని ఆదివాసి జిల్లాగా ఏర్పాటుచేయాలని, పోడు భూములు, ఆదివాసుల సంస్కృతి, జీవన విధానాన్ని కాపాడాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డి.పట్టా భూములకు కౌలుదార్లకు రుణ సౌకర్యం కల్పించాలని, ఉచిత వ్యవసాయ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జగ్గంపేట మండలం మల్లిసాలలో 353/2 సర్వే నంబరులో 500 ఎకరాల 80 సెంట్లు అడ్డుకొండ భూములను మల్లిసాల, కె గోపాలపురం గ్రామాల పేదలకు పంపిణీ చేయాలని కోరారు.

రైతాంగంపై మోపిన అన్ని రకాల కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, స్త్రీ విముక్తి రాష్ట్ర కార్యదర్శి కె.అనురాధ, తెలంగాణ కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top