
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపడితే అడ్డుకుంటానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి పునాది వేస్తే ఆ రోజున ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానన్నారు. ఇప్పుడున్న సచివాలయాన్ని ఉద్దేశించి సీఎం చేసిన ‘చెత్త’ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం ఇష్టానుసారంగా భూములను కొట్టేస్తోందని మండిపడ్డారు.
సచివాలయం, బేగంపేట విమానాశ్రయం రెండో టెర్మినల్ విస్తరణ పేరుతో బైసన్ పోలో, పరేడ్ గ్రౌండ్స్ భూములను కేసీఆర్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందని వీహెచ్ పేర్కొన్నారు.