ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు : వీరప్ప మొయిలీ

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూడా పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... రక్షణ సంబంధమైన అంశాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మొయిలీ విమర్శించారు. దేశ రక్షణ కోసం 126 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు.. రాఫెల్ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందని ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రిలయన్స్ కంపెనీకి ఎన్డీయే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్నారు. ఈ కాంట్రాక్టుకు 12 రోజుల ముందు అనిల్ అంబానీ కంపెనీ ఏర్పాటు చేశారని... తద్వారా 61 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఎటువంటి అనుభవం లేని ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడమంటే రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడమేనని మొయిలీ విమర్శించారు.
పార్టీ తరపున మెమోరాండం ఇస్తాం..
రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారణ జరపాలని కోరిన విషయాన్ని మొయిలీ గుర్తుచేశారు. ప్రతీ వేదికపై రాహుల్ ఈ విషయాన్ని లేవనెత్తుతున్నా.. మోదీజీ మాత్రం మౌనంగానే ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ విషయమై సెప్టెంబరు 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెమోరాండం అందిస్తారని తెలిపారు. అదే విధంగా 24న గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున మెమోరాండం అందజేస్తామని పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి