కేసీఆర్‌దే కపటప్రేమ

Utham kumar Slams KCR Regarding BC Resevations Issue - Sakshi

మా చిత్తశుద్ధిని నిందించే అర్హత మీకు లేదు

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ కౌంటర్‌

మమ్మల్ని అసెంబ్లీ నుంచి గెంటేసి పంచాయతీరాజ్‌ బిల్లు ఆమోదించుకున్నారు

ఇప్పుడు కోర్టు తప్పుబడితే బట్టకాల్చి మా మీద వేస్తారా?

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ దీటైన కౌంటర్‌ ఇచ్చింది. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిందించే అర్హత కేసీఆర్‌కు లేదని, బీసీలపై టీఆర్‌ఎస్‌దే కపట ప్రేమ అని ఆరోపించింది. తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ బట్టకాల్చి మా మీద వేసి మమ్మల్ని బదనాం చేయాలనే దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడింది. నిజంగా సీఎం కేసీఆర్‌కు బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించాలని, ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్‌ చేసింది.

అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తాము బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తాము కోర్టులో కేసు వేశామని చెప్పడం శుద్ధ అబద్ధమని, అసలు ఆ కేసులకు కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడగా.. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
52 శాతం పెట్టాల్సింది: దాసోజు
 
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కేసీఆర్‌కు ఇష్టం లేదని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ‘1999లో 34 శాతం రిజర్వేషన్లు పెట్టి చట్టాన్ని ఆమోదిస్తే 2018లోనూ ఇదే శాతాన్ని పెట్టడం వెనుక ఔచిత్యం ఏంటి? శాస్త్రీయ పద్ధతి కాకుండా పాత చట్టాన్ని కాపీ చేయడం ఏ మేరకు న్యాయం? జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అనేక వేదికల మీద విజ్ఞప్తి చేశాం. సమగ్ర కుటుంబ సర్వేలో 52 శాతం బీసీలున్నారని చెప్పి 34 శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టంలో ఏ ప్రాతిపదికన పెట్టారు? అంటే మిగిలిన 18 శాతం మందికి రిజర్వేషన్లు అవసరం లేదని అనుకుంటున్నారా?’అని మండిపడ్డారు.

‘ఈ విషయంలో బీసీ ప్రజలు, కుల సంఘాలు లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి ఉంది. 34 శాతం ఎలా ఇచ్చారో కొట్లాడాలి. పోరాటం చేయాలి. బీసీ కులాల వర్గీకరణ జరిగితే ముస్లింలు కూడా సర్పంచ్‌లు, ఎంపీటీసీలయ్యే అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. ‘స్వప్నారెడ్డి అనే వ్యక్తి కేసు వేశారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ కేసుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. స్వప్నారెడ్డి అంటే కాంగ్రెస్‌ వ్యక్తి అంటున్నారు. మరి గోపాల్‌రెడ్డి ఎవరు? నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని గున్యాగుల ఎంపీటీసీనా కాదా.. ఆయన టీఆర్‌ఎస్‌ సభ్యుడా కాదా చెప్పాలి. మరి మీ సభ్యుడు కేసు ఎలా వేశారు.. మీరేమైనా వేయమని చెప్పారా?’అని ప్రశ్నించారు. 

కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదు: షబ్బీర్, పొంగులేటి 
కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌కు సిగ్గురాదని షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ‘2013 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇప్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. 50 శాతం నిబంధనను పక్కనపెట్టి 61 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఇంత పెద్ద సమస్యపై కోర్టులో వాదనలు జరుగుతుంటే అడ్వొకేట్‌ జనరల్‌ ప్రభుత్వ పక్షాన ఎందుకు హాజరు కాలేదు. నేను చెప్పిందే చట్టం అని కేసీఆర్‌ అనుకుంటున్నందునే ఈ సమస్య. ఇప్పటికైనా ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి’అని వారు డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌వి బోగస్‌ మాటలు: ఉత్తమ్‌ 
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్నారు’అని ఉత్తమ్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిజర్వేషన్లపై బోగస్‌ మాటలు మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఎవరో హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరఫున సరిగా వాదనలు వినిపించలేక తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి చర్చ లేకుండా పంచాయతీరాజ్‌ చట్టం బిల్లు ఆమోదింపజేసుకున్నారు. చర్చ జరిగి ఉంటే బాగుండేది. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top