కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ

Union Cabinet, Janata Dal (United), BJP, Nitish Kumar - Sakshi

కానీ, సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలి

న్యూఢిల్లీ: సరైన ప్రాతినిధ్యం కల్పిస్తే కేంద్ర కేబినెట్లో చేరేందుకు సిద్ధమేనని జనతాదళ్‌(యునైటెడ్‌) బుధవారం సంకేతాలిచ్చింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈ జూన్‌ నెలలో కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని జేడీయూ నిరాకరించిన విషయం తెలిసిందే. జేడీయూకి కేంద్రంలో ఒకే మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించడంతో ప్రభుత్వంలో చేరేందుకు నాడు జేడీయూ నిరాకరించింది. తాజాగా, బుధవారం జరిగిన జేడీయూ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల్లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను పార్టీ మరో మూడేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ తరువాత నితీశ్‌ పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు.

అనంతరం ఆ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి మీడియాకు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు జేడీయూ సిద్ధంగానే ఉందని, అయితే, తమకు మంత్రిమండలిలో సరైన ప్రాతినిధ్యం కావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కానీ ఈ విషయంలో చొరవ తీసుకుంటే తాము స్వాగతిస్తామన్నారు. ఈ విషయంలో తామేమీ షరతులు విధించబోమన్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య ప్రభుత్వ ఏర్పాటులో విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో.. తాజాగా జేడీయూ ఈ ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను నితీశ్‌ ఓడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top