‘వైఎస్‌ జగన్‌ ఒక అడుగు ముందుకేశారు’

Undavalli Aruna Kumar Praised YS Jagan And Slams Chandrababu - Sakshi

సాక్షి, రాజమండ్రి : ఏపీ ప్రయోజనాల కోసం పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఒకడుగు ముందుకేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం 25 ఎంపీ సీట్లు ఇస్తే చక్రం తిప్పుతానంటూ లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, విభజన బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా పాస్‌ చేశారని ఉండవల్లి తెలిపారు. విభజన బిల్లు ఆమోద సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు.

‘ఓటింగ్‌ సరిగా నిర్వహించలేదరి, పార్లమెంట్‌ తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారు. లైవ్‌ ప్రసారాలు ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. కేంద్రం ఇచ్చిన నిధులపై అడిగే హక్కు ఎవరికి ఉందో చంద్రబాబు చెప్పాలి. మీరు నిజయంగా యూసీలు ఇచ్చుంటే ఆన్‌లైన్‌లో పొందుపరచండి. అప్పుడే చంద్రబాబుపై ప్రజలకు విశ్వాసం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీపై జేసీ దివాకర్‌ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించాలి. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ’ ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు.

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని సీఎం చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డులో ఎలా నియమిస్తారో చెప్పాలని చంద్రబాబును ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top