స్పీకర్‌గా తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవం!

Unanimous election of Tammineni Sitaram as the Speaker - Sakshi

అధికారికంగా నేడు ప్రకటన

స్పీకర్‌ పదవికి ఆయన ఒక్కరి నామినేషన్‌ మాత్రమే దాఖలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ఆరుసార్లు గెలుపు

గతంలో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన తమ్మినేని

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. స్పీకర్‌ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో గురువారం ఆయన ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. 15వ శాసనసభ తొలిరోజు ఎమ్మెల్యేల పదవీ ప్రమాణస్వీకారం జరిగింది. ఇదే రోజున స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్‌ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంట రాగా తమ్మినేని సీతారాం.. శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

తమ్మినేనికి మద్దతుగా సంతకాలు చేసిన వారిలో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, షేక్‌ బేపారి అంజాద్‌ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎం.శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పీడిక రాజన్నదొర, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసులు, జోగి రమేష్, కోలగట్ల వీరభద్రస్వామి, గొల్ల బాబూరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ, ఎం.నవాజ్‌ బాష, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విడదల రజని, ఫాల్గుణ, అర్థర్, వసంత వెంకట కృష్ణప్రసాద్, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top