స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలి

Ummareddy Venkateswarlu comments At Independence Day - Sakshi

ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

హైదరాబాద్‌/విజయవాడ సిటీ: స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వీరుల చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘72 ఏళ్ల స్వాతంత్య్రంలో మనం 74 శాతం మాత్రమే అక్షరాస్యత సాధించాం. అక్షరాస్యత ఉన్నచోట ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఆ విషయాన్ని దివంగత సీఎం వైఎస్సార్‌ గుర్తించి ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.

వైఎస్సార్‌ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని ఆకాంక్షించారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని, దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించే వ్యక్తిగా తయారవుతారని తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పుత్తా ప్రతాప్‌ రెడ్డి, రెహమాన్, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతీ, నదీమ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కన్న కలలను సాకారం చేయడానికి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కృషి చేస్తోందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top