సంచలన వ్యాఖ్యలు చేసిన ఉమా భారతి

Uma Bharti Claims Priyanka Gandhi As Thief Wife - Sakshi

రాయ్‌పూర్‌ : ప్రజలు ఓ దొంగ భార్యను ఎలా చూస్తారో.. ప్రియాంక గాంధీని కూడా అలానే చూస్తారంటూ కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పలు విషయాల గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఉమా భారతి స్పందిస్తూ.. దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు.  ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం ఏ మేరకు ఉండబోతుందని ఓ విలేకరి ఆమెను ప్రశ్నించగా.. ‘ఏమి ఉండదు. ఆమె భర్త మీద దొంగతనం అభియోగం ఉంది. అలాంటప్పుడు ఆమె వల్ల ఏం ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఓ దొంగ భార్యను ఎలా చూస్తారో.. ప్రియాంకను కూడా అలానే చూస్తార’ని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ.. ఓడిపోతానని తెలిసే అతను అమేథీ, వయనాడ్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌.. జయప్రదను ఉద్దేశిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఉమా భారతి.. ఈసీ ఆజం ఖాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక దేవుడి పేరును ఉచ్ఛరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటిది మహిళను కించపర్చిన ఆజం ఖాన్‌ మీద ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top